Tomato Prices : తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాదిలో టమాటా ధరలు కొండెక్కాయి. రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో టమాటా ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. వారం రోజుల్లో టమాటా ధరలు కిలో రూ.20 నుంచి రూ.80కు చేరాయి. మే 7న టమాటా ధరలు కిలో రూ.24–44 ఉంటే 13వ తేదీన రూ.39–60కు చేరాయి. అయితే బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలు రూ.50 నుంచి 80 వరకు ఉన్నాయి. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు టమాటా పేరుచెబితే చాలు హడలిపోతునన్నారు. మే నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో మటామా పంట దిగుబడులు తగ్గిపోయి ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. మదనపల్లె నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు టమాటా ఎగుమతులు జరుగుతున్నాయి. మార్కెట్లలో స్థానికంగా సరుకు రాకపోవడం, డిమాండ్‌ అధికంగా ఉండటంతో వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. మే చివరి వరకు టమాటా ధరలు అధికంగా ఉంటాయని వ్యాపారులు చెపుతున్నారు. మార్కెట్‌లో టమాటా ధరలపై రైతులు మాత్రం ఆనందంగా ఉన్నారు. 


పది రోజుల వ్యవధిలో రూ. 50కు పైగా 


టమాటా ధరలు మళ్లీ కొండెక్కాయి. కర్నూలు మార్కెట్‌లో టమాటా కిలో రూ.80 పలుకుతుంది. రైతు బజార్‌లో రూ.70 ఉంటే, బయటి మార్కెట్‌లో పది రూపాయలు అధికంగా ఉంది. కూరగాయాలతో పాటు టమాటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది. పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో టమాటా 50 రూపాయలు పెరిగిపోయింది. ప్రస్తుతం టమాటా మార్కెట్లో 65 నుంచి 80 రూపాయలు వరకు పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారులు అంటున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఈవిధంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు టమాటా ధరలు చుక్కల్ని తాకుతాయని చెబుతున్నారు.


అన్ సీజన్ లో అత్యధిక ధరలు 


చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్‌లో టమాటా ధరలు అత్యధిక మార్కును అందుకుంటున్నాయి. మార్కెట్ లో టమాటా కిలో రూ.56 వరకు పలుకుతోంది. అన్‌ సీజన్‌లో ఇదే అత్యధిక ధర. గత నాలుగేళ్లుగా అన్‌సీజన్‌లో అత్యధిక ధర ఇదేనని వ్యాపారులు అంటున్నారు. రాష్ట్రంలో టమాటా దిగుబడులు ఆశించిన రీతిలో లేకపోవడంతో ధరలకు రెక్కలొచ్చాయి. బయట మార్కెట్లలో కూడా టమాటా అంతగా లేకపోవడంతో చాలా మంది వ్యాపారులు మదనపల్లె మార్కెట్‌కే వస్తున్నారు. టమాటా ధరలు పెరగడంతో వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా టమాటాల ఉత్పత్తి తగ్గిపోయింది. అక్కడి వ్యాపారులు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, ఏపీ నుంచి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ రాష్ట్రాల నుంచి కర్నూలు, చిత్తూరు, కర్నాటకలోని కోయంబేడు మార్కెట్‌కు వచ్చే టమాటా లోడ్లు బాగా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు ఆకాశానంటుతున్నాయి.