సినిమా పరిశ్రమలో ఒక్క సాలిడ్ హిట్ పడితే చాలు, రెమ్యునరేషన్ ఏకంగా కోట్లకు చేరుకుంటుంది. క్రేజ్ కు తగ్గట్లుగానే పారితోషికం పెరుగుతూనే ఉంటుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ సైతం ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ హీరో బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రజత్ శర్మ ‘ప్యార్ కా పంచనామా’ సినిమాతో కార్తిక్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. తన తొలి సినిమా కోసం ఈ హీరో కేవలం రూ.1.25 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు కోట్ల రూపాయలు వసూళు చేస్తున్నాడు. అక్షరాలా రోజుకు రూ. 2 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కార్తిక్ స్వయంగా వెల్లడించారు.
కరోనా సమయంలో కార్తిక్ ఒక్క సినిమా కోసం రూ. 20 కోట్లు పారితోషికం తీసుకున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తాజాగా ఆయన స్పందించారు. ఆ వార్తలు వాస్తమేనని చెప్పారు. “కరోనా లాక్ డౌన్ టైమ్ లో నేను ఓ సినిమా చేశాను. ఆ సినిమాకు గాను రూ. 20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఈ సినిమా షూటింగ్ కేవలం 10 రోజుల్లో కంప్లీట్ చేశాను. ఆ సినిమా వల్ల నిర్మాతలకు మంచి లాభం వచ్చింది. అందుకే, నేను అంత పారితోషకం తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు అనిపించింది” అన్నారు.
ఇక తన సినిమాల గురించి కూడా కార్తిక్ ఆర్యన్ కీలక విషయాలు వెల్లడించాడు. “గతేడాది నేను చేసిన హారర్ కామెడీ మూవీ ‘భూల్ భులయ్యా-2’ మంచి సక్సెస్ అందుకుంది. నేను కూడా కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రేక్షకులను బాగా అలరించే వాటికే ఓకే చెప్తున్నాను. నా కష్టాన్ని తెర మీద చూస్తున్నారు కాబట్టే, ప్రేక్షకులు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల ప్రేమ ఇలాగే మున్ముందు కూడా పొందేందుకు ప్రయత్నిస్తాను”అని వెల్లడించారు.
వరుస సినిమాలు చేస్తున్న కార్తిక్ ఆర్యన్
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అలవైకుంఠ పురములో’ సినిమా హిందీ రీమేక్ ‘షెహజాదా’లో నటిస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న బాలీవుడ్ లో అట్టహాసనంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో మాదిరిగానే బాలీవుడ్ లోనూ బ్లాక్ బ్లస్టర్ సాధిస్తుందని సినీ జనాలు అంచనా వేస్తున్నారు. 'షెహజాదా'తో పాటు, కార్తీక్ ఆర్యన్ 'ఆషికీ 3', 'సత్యప్రేమ్ కి కథ', 'కెప్టెన్ ఇండియా'లో కూడా నటిస్తున్నారు.
Read Also: ‘వారిసు’ ఓటీటీ రిలీజ్ డేట్ లీక్! ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చంటే?