Akhil Akkineni On Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి. రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తులు దిగజారి మాట్లాడకూడదని మండిపడ్డారు. వెంటనే అక్కినేని కుబుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున‌, అమ‌ల‌, నాగ చైత‌న్య‌ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు కొండా సురేఖను వెంటనే మంత్రి పదవిని నుంచి తొలగించాలంటూ అమల ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీని కోరింది.


కొండా సురేఖపై ఫ్యామిలీపై అక్కినేని ఫ్యామిలీ పరువునష్టం దావా


ఇప్పటికే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తాజాగా ఇదే విషయానికి సంబంధించి అక్కినేని నాగార్జున సైతం కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దిగజార్చేలా దారుణ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులోకేసు ఫైల్ చేశారు.  మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.   


న్యాయపరంగా బుద్ది చెప్పాలి- అక్కినేని అఖిల్


మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల కొడుకు, యువ నటుడు అఖిల్  సీరియస్ అయ్యారు. అర్థం లేని విష‌యంపై స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్యక్తం చేశాడు. కానీ, కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప వేరే మార్గం లేదన్నారు. “కొండా సురేఖ చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ఉన్న ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె వ్యాఖ్యలు మా కుటుంబ సభ్యుల గౌరవాన్ని కించపరిచాయి. అగౌరవ పరిచాయి. ఆమె స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం ఎలాంటి సంబంధం లేని తమ కుటుంబాన్ని లాగడం అభ్యతరకరం. ఆమె ఆడిన రాజకీయ క్రీడలో మాలాంటి అమాయకులను బలిపశువులుగా నిలబెట్టారు. బాధిత కుటుంబ సభ్యుడిగా, సినీ నటుడిగా ఈ విషయంపై నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాలిన వ్యక్తికి న్యాయపరంగా తగిన బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తాం. సమాజంలో ఆమె లాంటి వాళ్లకు ఉండే అర్హత లేదు. ఆమెను ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు” అంటూ ట్విట్టర్ వేదికగా తన కోపాన్ని వెల్లగక్కారు. 






ప్రస్తుతం అఖిల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొండా సురేఖ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పినప్పటికీ ఒక కుటుంబంపై వేసి అభాండాలను ప్రజలు ఎలా మర్చిపోతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కచ్చితంగా ఆమెకు కోర్టు ద్వారా తగిన బుద్ది చెప్పాలని నెటిజన్లు అఖిల్ కు సూచిస్తున్నారు.  


Read Also:మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!