తమన్, దేవిశ్రీప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ మధ్యకాలంలో తమన్ జోరు మరింత పెరిగింది. వరుస హిట్స్ అందుకుంటున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ అయితే 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. వీరిద్దరూ కూడా ఒక్కో సినిమాకి రూ.3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. పైగా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. దీంతో దర్శకనిర్మాతలు వేరే ఆప్షన్స్ చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో మణిశర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి. అలానే ఇప్పుడు ఏఆర్ రెహ్మాన్ ను పలు సినిమాల కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఓ సినిమాను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహ్మాన్ ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
అలానే దర్శకుడు పూరి జగన్నాధ్ కూడా తన సినిమాకి ఏఆర్ రెహ్మాన్ తో మ్యూజిక్ వర్క్ చేయించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను రూపొందిస్తున్న ఆయన తన తదుపరి సినిమాను కూడా రౌడీ హీరోతోనే చేయబోతున్నారు. మహేష్ కోసం రాసుకున్న 'జనగణమన' స్క్రిప్ట్ తో విజయ్ సినిమా ఉంటుందని టాక్. ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి కరణ్ జోహార్ బ్యాకప్ ఉండడంతో రెహ్మాన్ కచ్చితంగా ఒప్పుకుంటారని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
నిజానికి రెహ్మాన్ తెలుగు సినిమాలకు పెద్దగా పని చేసింది లేదు. మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గా రెహ్మాన్ ను అనౌన్స్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన తప్పుకున్నారు. ఇప్పుడు రెండు క్రేజీ సినిమాల కోసం ఆయన్ను సంప్రదించనున్నారు. మరి ఈ సినిమాలైనా ఒప్పుకుంటారో లేదో..!