తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండగకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సమయంలో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు విడుదల అయి భారీ విజయాన్ని, కలెక్షన్లను సాధిస్తుంటాయి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పెద్ద సినిమాలు విడుదలకు పోటీపడుతూ ఉంటాయి. అంతగా ఈ పండగ సీజన్ కు డిమాండ్ ఉంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సంక్రాంతి పండక్కి సినిమాలు విడుదల అయ్యాయి. ఇక వచ్చే ఏడాది 2024 సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోల సినిమాలను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల అయ్యే పెద్ద సినిమాల లిస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. దీంతో విడుదల తేదీలు కంఫర్మ్ చేసుకోవడానికి సిద్దపడుతున్నారు మేకర్స్.
ఇప్పటికే అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప 2’, ప్రభాస్ నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’, రామ్ చరణ్ హీరోగా ‘ఆర్ సి 15’ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ లు శర వేగంగా షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఈ సినిమాలపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మహేష్ సినిమా మినహా మిగతా సినిమాలు అన్నీ వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. ఇక మహేష్ సినిమా షూటింగ్ కు మధ్యలో గ్యాప్ రావడంతో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోతే ఈ మూవీ కూడా సంక్రాంతి బరిలో దిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మూవీను 2024 జనవరి 12 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. దాదాపు 500 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోణ్, దిశా పటాని నటిస్తున్నారు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మొదటి భాగం దేశవ్యాప్తంగా హిట్ అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై ఉత్కంఠ మొదలైంది. అలాగే శంకర్-రామ్ చరణ్ బిగ్ కాంబో పై కూడా అంచానాలు విపరీతంగా ఉన్నాయి. వీటితో పాటు మహేష్ సినిమా కూడా సంక్రాంతికే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే సంక్రాంతికి భారీ పోటీనే ఉంటుందంటున్నారు.
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ మినహా మిగతా సినిమాలు విడుదల తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ ఏడాది కూడా సంక్రాంతికి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైటే జరిగింది. ఈ రెండు సినిమాలు నిర్మించింది ఒకే సంస్థ అయినా వీటితో పాటు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన విజయ్ ‘వారసుడు’ సినిమా కూడా సంక్రాంతికే విడుదల కావడంతో థియేటర్ల పంపిణీ లో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు విడుదల అయితే బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదంటున్నారు సినీ నిపుణులు. మరి వచ్చే సంక్రాంతి సమయానికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.