Nani Saripodhaa Sanivaaram Update: ‘దసరా’, ‘హాయ్ నాన్న’ సినిమాల బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న నాని, అదే ఊపులో మరో సినిమా చేస్తున్నారు. ‘సరిపోదా శనివారం’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ లో డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.


180 రోజులు, 26 శనివారాలు


‘సరిపోదా శనివారం’ సినిమా మరో 180 రోజుల్లో ప్రేక్షకుల మందుకు రాబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇందులో 26 శనివారాలు ఉండబోతున్నట్లు చెప్పుకొచ్చారు. “180 రోజులు, 26 శనివారాలు, ఆ తర్వాత మీరు సంబరాలు చేసుకుంటారు. ఓ వ్యక్తిలోని కోపాన్ని చూసి గోల చేస్తారు, ఉత్సాహపడతారు” అంటూ వెల్లడించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో నాని ఓ వ్యక్తిని కోపంతో చితక బాదుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పోస్టర్ ను చూసి సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






నాని బర్త్ డే సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ విడుదల


ఇక నాని బర్త్ డే సందర్భంగా ఫిబ్రవరి 24 నాడు‘సరిపోదా శనివారం’ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో నాని సూర్య అనే యువకుడి పాత్రలో కనిపించాడు. "కోపాలు రకరకాలు. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కోలాగా ఉంటుంది" అంటూ సూర్య వాయిస్‌ తో ‘శనివారం గ్లింప్స్’ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాలో నానికి విపరీతమైన కోపం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ కోపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కేవలం శనివారం రోజు మాత్రమే చూపించాలని నిర్ణయం తీసుకుంటాడు. అలాంటి నిర్ణయం తీసుకున్న నాని జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్‌ లో నాని లుక్, స్టైల్ ఆకట్టుకుంది. గ్లింప్స్ చివరల్లో హ్యాపీ బర్త్ డే బ్రదర్ అంటూ ఎస్‌జే సూర్య చెప్పిన డైలాగ్, నవ్వు సినిమాపై అంచనాలు పెంచింది. పోలీస్ స్టేషన్ లో చుట్టూ రౌడీలు, రక్తం మరకలతో పోలీస్ యూనిఫామ్‌ లో ఎస్ జే సూర్య వికటాట్టహాసం సినిమాపై క్యూరియాసిటీ కలిగించింది.  


ఆగస్టు 29న పలు భాషల్లో విడుదల


ఇక ‘సరిపోదా శనివారం’ సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్ ఎండ్ లో వెల్లడించారు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది.   ఈ సినిమా కోసం నాని, వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.  


Read Also: ఈసారి మరింత కామెడీతో ‘సేవ్ ది టైగర్స్ 2’- ట్రైలర్ చూస్తే పొట్టచక్కలు కావాల్సిందే!