MLA Peddareddy : అనంతపురం అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది ఫ్యాక్సనిజం. ప్యాక్షనిజం అంటే అనంతపురం జిల్లాలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి గుర్తుకు వస్తారు. తాడిపత్రి నియోజకవర్గంలో వీరిద్దరి మధ్య పోరు రాష్ట్ర రాజకీయాల్లోనే ఆసక్తిని కలిగిస్తుంటుంది. ఒకానొక సమయంలో పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికి వెళ్లి.. ఆయన కుర్చీలోనే కూర్చుని రావడం ద్వారా సీమ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించారు. అటువంటి రాజకీయ వైరం ఉన్న ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధపడుతున్నారు. ఈసారి పెద్దారెడ్డిపై జేసీ అస్మిత్‌రెడ్డి పోటీకి సిద్ధపడుతున్నారు. ఈ నేపత్యంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏబీపీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ వివరాలు మీ కోసం.
ABP దేశం : వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి అస్మిత్‌రెడ్డి పోటీ చేయబోతున్నారు.? పోటీ ఎలా ఉండనుంది.?
పెద్దారెడ్డి : తాను ప్రజల్లో ఉన్న నాయకుడిని. ప్రత్యర్థి ఎవరైనా ఒకటే. గతానికి ఇప్పటికీ ప్రజల్లో, నాయకుల్లో చాలా మార్పు వచ్చింది. గడిచిన 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రత్యర్థులను, ప్రజలను భయపెడుతూ రాజకీయాలు చేశారు. తాము వచ్చిన తరువాత ఇక్కడ ప్రజలకు భయం పోయింది. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ ఉండేవి. గడిచిన ఐదేళ్లలో అటువంటి రాజకీయాలు ఇక్కడ లేవు. ప్రజలకు వాక్ స్వాతంత్రం వచ్చింది. స్వేచ్ఛగా ఉన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఎవరు పోటీ చేసినా పర్వాలేదు. ఎవరైనా పోటీ చేయవచ్చు.
ABP దేశం : పెద్దారెడ్డే ఫ్యాక్షన్ తెచ్చాడని అంటుంటారు. దీనికి మరేమంటారు.?
పెద్దారెడ్డి : తాడిపత్రికి ఇన్‌చార్జ్‌గా వచ్చినప్పటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చాను. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత క్రైమ్‌ను ఎంటర్‌టైన్ చేయలేదు. ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించలేదు. వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు నష్టం వాటిళ్లలేదు. తాను ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తానని కూడా ఎప్పుడూ చెప్పలేదు. రాజకీయాలను ప్రక్షాళన చేస్తానని చెప్పా. ప్రజలను మోటివేట్ చేయడం ప్రక్షాళన కిందే వస్తుంది. మీడియా నా మాటలను వక్రీకరించి ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రచారం చేశారు.
ABP దేశం : 2024లో పెద్దారెడ్డి విజయానికి దోహదం చేసే అంశాలేవీ..?
పెద్దారెడ్డి : వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రోబ్లమ్ లేదు. ఫ్యాక్షన్ హత్యలు జరగలేదు. అనేక గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. తాగునీటి సదుపాయాన్ని కల్పించాం. ఇరిగేషన్ రైతుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. బోర్లు వేయించే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా రైతులకు ఆర్థికంగా ఇబ్బందులను తగ్గించాం. రోడ్డు వేయలేదన్న ప్రచారంలో వాస్తవం లేదు. అనేక గ్రామాలకు రోడ్లు వేయించాం. గ్రామాలకు వెళ్లి చూస్తే మీకే అర్థం అవుతుంది. గత పాలకులు అభివృద్ధి జరిగితే ప్రజలపై కంట్రోల్ ఉండదని భావించి అలా చేశారు. తాను ఎమ్మెల్యే అయిన తరువాత కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చాను. ఎమ్మెల్యేగా ఉండి కూడా పాదయాత్ర చేశాను. ప్రజలకు స్కీములు అందుతున్నాయో లేదో తెలుసుకున్నాను. లోకల్ నాయకులు ఇబ్బందులు పెడుతున్నారా..? అని ప్రజల వద్దకే వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేశా. సంక్షేమ పథకాలు అందని వాళ్లు ఉంటే నన్ను కలుస్తారు. నేను లేకపోయినా ఆఫీస్‌లో సిబ్బంది వారికి అవసరమైన సహకారాన్ని అందిస్తుంటారు. వారి సమస్యలను పరిష్కరించి మేలు చేస్తున్నాం.
ABP దేశం : తాడిపత్రి ఆశించిన స్థాయిలో అభివృద్ధి అభివృద్ధి జరగలేదంటారు. దీనికి మీరేమంటారు.?
పెద్దారెడ్డి : ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు తెచ్చాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాం. వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావించినప్పుడు.. అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేశాం. ప్రతి ఇంటికి నీరు ఇచ్చేందుకు అమృత స్కీమ్ కింద రూ.63 కోట్లు తెచ్చాం. మున్సిపల్ చైర్మన్‌గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ పనులు కాకుండా అడ్డుపతున్నాడు. పెద్దారెడ్డి అభివృద్ధి పనులు చేయిస్తున్నాడనే బాధ వాళ్లకు ఉంది. ఎన్నడూ లేని విధంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు వేయించాం. డ్రైన్లు కట్టించాం. కొన్ని పనులు జరగకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. స్టే తేవడం అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం పరిపాటిగా మారింది. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదనడం అపోహ మాత్రమే. మున్సిపల్ ఆఫీస్‌కు తాను ఇప్పటి వరకు రెండు, మూడు సార్లు మాత్రమే వెళ్లాను. జేసీ ప్రభాకర్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు ప్రయత్నిస్తాడు. ఆయన ఏదైనా చేస్తే కదా అడ్డుపడుతున్నామని చెప్పడానికి. తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఇక్కడి ప్రజలు ఇళ్లు కట్టుకుంటున్నారు. షాఫింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకున్నారు. భూములు రేట్లు భారీగా పెరిగాయి. అభివృద్ధి చేయడంతోపాటు స్వేచ్ఛ కల్పించాను. ఫోర్స్‌గా ప్రజల వైపు నిలబడి ఉన్నాను. ఇవన్నీ జేసీకి నచ్చడం లేదు.
ప్రశ్న : టీడీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టారా..?
పెద్దారెడ్డి : గడిచిన ఐదేళ్లలో తాను వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్లలేదు. గ్రామాల్లో కార్యకర్తలు ఆనందంగా ఉన్నారు. జేసీతో కూడా రాజకీయ వైరమే తప్పా వ్యక్తిగత వైరం లేదు. తాను పట్టించుకోకుండా వదిలేస్తే రోజూ అరాచకాలు జరుగుతాయి. జేసీని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా. ప్రజల సపోర్ట్ కూడా తనకే ఉంది. ప్రజాస్వామ్యంగానే జేసీని కంట్రోల్ చేస్తున్నా. ఇటువంటి మూర్ఖులతో ఎందుకు అన్న భావన ప్రజల్లో ఉంది. వారికి అండగా తాను ఉంటున్నా. కప్పాలు వసూలు చేస్తామనే ప్రచారంలో వాస్తవం లేదు. ట్రాన్స్‌ఫోర్ట్ బిజినెస్ చేస్తున్నాం. కమీషన్లు ఉండవు. ఈ వ్యవస్థను కాపాడుకోవాలి. ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లోకి అనుకోకుండా వచ్చాం. పిల్లలు ఎక్కడైనా వ్యాపారం చేయాలి. అది ఇక్కడే చేస్తే బాగుంటుందన్న ఉద్ధేశంతో దించాం. వ్యాపారం బాగానే ఉంది.
ప్రశ్న : పెద్దారెడ్డి నాన్ లోకల్ అన్న ప్రచారం ఉంది. దీనిపై మీరేమంటారు..?
పెద్దారెడ్డి : నేను పక్కా లోకల్. మా నాన్న సమితి ప్రెసిడెంట్‌గా చేశాడు. అన్నయ్య ఇక్కడే ఉంటాడు. నాకు కాంప్లెక్స్ కూడా ఉంది. తాము ఇక్కడి వాళ్లమే. ఆధిపత్య పోరులో భాగంగానే పెద్దారెడ్డి నా సొంత ఊరు వచ్చి ఇళ్లు కట్టుకున్నాడు. తాడిపత్రి మిగిలిన ప్రాంతాలకు రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించాలని భావించారు. వారికి ఇక్కడే బ్రేక్ పడింది. విస్తరణ ఆలోచన లేకుండా పోయింది. ఇక్కడ గెలవడంపైనే దృష్టి సారించారు.
ప్రశ్న : జేసీ, కేతిరెడ్డి ఫ్యామిలీకి గొడవ ఎక్కడ ప్రారంభమైంది..?
పెద్దారెడ్డి : మేము ముందు నుంచీ రాజశేఖర్‌రెడ్డి వర్గీయులం. వాళ్లు ఆయనకు వ్యతిరేకంగా ఉంటూ రాజశేఖర్‌రెడ్డి వ్యతీరేకంగా ఉండేవారిని ప్రోత్సహించేవారు. మా ఎదుగుదల ఉండకూడదని భావించారు. జేసీ వర్గానికి వ్యతరేకంగా ఉంటూ ఇబ్బందులు పడిన వారికి షెల్టర్ ఇచ్చాం. అది జిల్లాలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఫ్యాక్షన్ కూడా విస్తరించింది. అనేక మంది చనిపోయారు. షెల్టర్ ఇచ్చే స్థితి నుంచి డైరక్ట్ జేసీతో తలపడేందుకు సిద్ధపడ్ఢాం. రాజకీయాల్లోకి వచ్చాం. వాళ్లు మంత్రిగా చేసినా ఈ ప్రాంతానికి నీళ్లు, ఇతర అవసరాలు కూడా తీర్చలేదు. తానెప్పుడూ పెద్ద గొడవలు జరిగినప్పుడు లేను. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మనల్ని నమ్మిన వారికి అండగా నిలబడాలి. మా అన్న డయాలసిస్ పేషెంట్‌గా చికిత్స తీసుకుంటున్నప్పుడు సీఎంగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి చూడడానికి వచ్చారు. అప్పట్లో మేం టీడీపీలో ఉన్నాం. రాజశేఖర్‌రెడ్డి రావడంతో మళ్లీ ఆయన మమ్మల్ని చేరదీస్తాడని భావించారు. రాజకీయంగా ఇబ్బంది అవుతుందని అలా చేశారు. అప్పటి పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లాం.
ప్రశ్న : టీడీపీలో ఉన్నప్పుడు పరిటాల రవితో సంబంధాలు ఎలా ఉండేవి..?
పెద్దారెడ్డి : మేం ఇటు జేసీ, అటు పరిటాల కుటుంబంతో పోరాటం చేశాం. అన్న ధర్మవరం ఎమ్మెల్యేగా పని చేశాడు. అప్పట్లో పరిటాల రవితో కూడా ఇబ్బంది ఉండేది. బలమైన శత్రువులు ఇద్దరు ఉన్నప్పుడు కొన్నిసార్లు వీరిలో ఎవరితో ఎక్కువ ఇబ్బందో గుర్తించా. బలహీనమైన వాడెవడో ఆలోచించి అప్పటి సమయాన్ని బట్టి సర్ధుకున్నాం. ఇద్దరినీ బలంగా ఫేస్ చేసి నిలబడ్డాం.
ప్రశ్న : వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే జేసీని తట్టుకోగలరా..?
పెద్దారెడ్డి : ఏం చేస్తారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నా. మూడు, నాలుగు నెలలు జైల్లో ఉంటా. అతను అయితే తట్టుకోలేదు. మేం అన్నింటికీ సిద్ధపడే రాజకీయాలు చేస్తున్నాం. కత్తులు, కటార్లు తీసుకుని తానేమీ జేసీ ఇంటికి వెళ్లలేదు. మాట్లాడేందుకు వెళ్లా. అప్పుడు అక్కడ జేసీ లేడు వచ్చేశా. జేసీ ఉంటే ఏమి నీ రాజకీయం అని అడిగేవాడిని. పోవాల్సి వచ్చినప్పుడు మళ్లీ పోతాను. ఎవరికీ భయపడేది లేదు.
ప్రశ్న : రెండు కుటుంబాల మధ్య వైఎస్ ఒప్పందం చేశారంటున్నారు. నిజమేనా..?
పెద్దారెడ్డి : అప్పట్లో రాజశేఖర్‌రెడ్డి చేశారు. ఇప్పుడు అవన్నీ లేవు. రాజశేఖర్‌రెడ్డి లేరు. వాళ్లు, మేం ఒక పార్టీలో లేం. కాబట్టి, ఎవరి రాజకీయాలు వాళ్లు చేసుకుంటున్నాం. తాడిపత్రికి అవార్డులను డబ్బులు ఇచ్చి తెచ్చాకున్నారు. జేసీకి అభివృద్ధి గురించి ఆలోచించే తీరిక కూడా లేదు. తాను ఇక్కడకు వచ్చే సరికి కేడర్ బలంగా లేదు. అంతా 35 ఏళ్లలోపు వాళ్లే. తామొచ్చిన తరువాత కార్యకర్తలను బలంగా చేశాం. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒకటి, రెండు వార్డులు గెలిచేవాళ్లు. ఇప్పుడు 16 గెలిచాం. మిగిలిన ఓడిన స్థానాలు కూడా స్థానిక అభ్యర్థులకు టికెట్లు రాకపోవడంతో వాళ్లే ఓడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలను శాంతి, భద్రతల మధ్య నిర్వహించాం. మున్సిపల్ ఎన్నికలు సమయంలో జేసీ ఒకరకంగా ఓటర్లను ప్రాదేయపడ్డాడు. బీసీని, ఎస్సీని చైర్మన్‌ను చేస్తానని చెప్పాడు. చేయలేదు. అబద్ధాలతో రాజకీయం చేసి గెలిచాడు.
ప్రశ్న : వైసీపీ రాయలసీమను అభివృద్ధి చేయలేదన్న విమర్శలపై మీరేమంటారు..?
పెద్దారెడ్డి : రాయలసీమ ప్రాంతానికి వైసీపీ ఏం చేసిందన్న విషయం ప్రజలకు తెలుసు. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఫలితాలు రోజు చూస్తారు. నాకు ఖాళీ సమయం దొరికితే వ్యవసాయం చేస్తాను. అనేక పంటలు పండించేవాడిని. ప్రస్తుతం 50 ఎకరాల్లో రెడ్ చిల్లీ పండిస్తున్నా. అందరి సినిమాలు బాగా చూస్తాను. మహేష్‌బాబు అంటే ఇష్టం. గతంలో కృష్ణ సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు మహేష్‌వి చూస్తుంటా. సినిమాలకు నార్మల్‌గానే వెళుతుంటాను. టైమ్ బాలేకపోతే ఎక్కడ ఉన్నా ఏదైనా జరుగుతుంది. బాగుంటే ఏమీ జరగదు. అప్పుడప్పుడు హైదరాబాద్‌లోని స్నేహితుల దగ్గరకు వెళ్లి వస్తుంటాను.