AP Uttarandhra Election Result 2024: ఐదేళ్ల తర్వాత తెలుగుగడ్డపై.. మళ్లీ పసుపు పతాక రెపరెపలాడింది. మూడు పార్టీల కూటమి మూడు ప్రాంతాలనూ కొల్లగొట్టింది. పేదేలకు పెద్దలకు మధ్య యుద్ధం అంటూ ఎన్నికలకు వెళ్లిన అధికార పార్టీని ప్రజలు పక్కకు పెట్టేశారు. పసుపు పెనుగాలికి దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది.
ఐదేళ్ల కిందట ఎంతటి ఘనమైన విజయమో.. ఇప్పుడు అంత ఘోర పరాజయం. మూడు పార్టీల కూటమి కలిసికట్టుగా వైసీపీని మట్టికరిపించింది. పసుపు పెనుగాలి ధాటికి వైకాపా రెక్కల తెగిన ఫ్యానుగా మారింది. అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని ప్రాంతాలను కొల్లగొట్టింది. వాళ్లూ వీళ్లూ అని లేకుండా మంత్రులందరినీ ఇంటి దారి పట్టించింది. 150కి పైగా సీట్లలో ఆధిక్యతతో తెలుగుదేశం కూటమి అప్రతిహతంగా దూసుకెళ్తోంది.
ఉత్తరాంధ్ర.. ఊపేసింది.. గోదారి పొంగిపొర్లింది. కృష్ణా-గుంటూరు పోటెత్తింది. ప్రకాశం నెల్లూరులోనూ జోరు కొనసాగింది. సీమ కోటను బద్ధలు కొట్టింది. మొత్తంమీద ఒక్క కడప మినహా ఏ జిల్లాలోనూ కూటమి ప్రభంజనానికి తిరుగే లేకుండా పోయింది. మూడు పార్టీలు.. కూటమి కట్టి.. కలిసికట్టుగా వైకాపా కోటను పడగొట్టాయి. కూటమి సునామీకి పాతిక మంది మంత్రుల్లో 23 మంది అడ్రెస్ గల్లంతైంది. ఎగ్జిట్ పోల్ మాటలు నిజం కాదు.. మా ఓటర్లు వేరు.. ఓ నిశ్శబ్ద కెరటాన్ని సృష్టిస్తామన్న వైసీపీ మాటలను జనం పటా పంచలు చేసేశారు ఆ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉండే రాయలసీమలోనూ.. చరిత్రలో ఎన్నడూ చూడని విజయాన్ని తెలుగుదేశానికి కట్టబెట్టారు. ఈ స్థాయి విజయాన్ని తెదేపా -జనసేన నేతలు కూడా ఊహించలేదు.
AP Uttarandhra Election Result 2024: ఉత్తరాంధ్రలో కూటమికి ఆధిక్యం ఉంటుందని ముందు నుంచీ ఊహించినప్పటికీ ఈ స్థాయి విజయం మాత్రం అనుకోలేదు. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో 32 కూటమి కొట్టేసింది. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని ఇంటి దారి పట్టారు. మొత్తం 10సీట్లనూ కూటమి నేతలు గెలుచుకున్నారు. విజయనగరంలో గట్టిపోటీ ఉంటుందనుకుంటే.. సీనియర్ మంత్రి బొత్స స్వయంగా ఓడిపోయారు. విశాఖలో కేవలం రెండు చోట్ల ఆధిక్యతలో ఉంది. పాడేరు, అరకు మినహా అన్నీ స్థానాలు కూటమి గెలుచుకోవడం ఖాయం.. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, నర్సన్నపేట, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, ఎచ్చెర్ల, ఆముదాలవలస, పాలకొండ, రాజాం నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందుకు సాగుతున్నారు. విజయనగరంలో బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, నెల్లిమర్ల, సాలూరు, పార్వతిపురం, కురుపాం, ఎస్.కోట, గజపతినగరం, నియోజకవర్గాల్లో కూటమికి చెందిన నేతలు పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతూ విజయం దిశగా ముందుకు సాగుతున్నారు.
గోదారి హోరెత్తింది: పవన్ కల్యాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ఈ జిల్లాలో కూటమి జోరుకు ఎదురేలేదు. రెండు ఎస్టీ సీట్లలో మినహా గోదారి ఆవలా.. ఇవతలా సైకిల్- గ్లాసుకు ఓట్లు కుమ్మరించారు. వేల మెజార్టీ లీడ్లలో ఉన్న ఈ ప్రాంతాల్లో రెండు చోట్ల మినహా అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం ఖాయం.
సీమ కోటకు బద్దలు
వైఎస్సార్సీపీ ధైర్యం అంతా కూడా రాయలసీమ. ఎంతలా అంటే నెల్లూరుతో కూడిన గ్రేటర్ రాయలసీమలో నాలుగు జిల్లాలలో 2019లో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయింది. చిత్తూరు, అనంతపురంలో ఒకటి- రెండుసీట్లు గెలిచి మొత్తం 3 సీట్లతో బయటపడ్డారు. 62 స్థానాలకు 3 చోట్ల గెలిచారు. కేవలం రాయలసీమ తీసుకుంటే 52 సీట్లు ఉంటే ఇప్పుడు వైసీపీకి కేవలం 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. తెలుగుదేశం శ్రేణులు కూడా ఊహించని రీతిలో సీమలో కూటమి టాప్ స్పీడులో దూసుకెళ్తోంది. అనంతపురంలో 3, చిత్తూరులో 2, కర్నూలు 2, కడపలో నాలుగు సీట్లు మినహా అన్ని చోట్లా కూటమి జెండా ఎగురుతోంది.కృష్ణమ్మ పొంగింది
రాజధాని ప్రాంతం కూడా పోయిన సారి జగన్ ను గెలిపించుకుంది. అమరావతిపై ఈ ప్రభుత్వ తీరుతో కృష్ణ, గుంటూరులో ఫ్యానుకు కష్టమే అని ముందు నుంచీ అంచనా ఉంది. కానీ మొత్తం తుడిచిపెట్టుకుపోయేంత అనుకోలేదు. కృష్ణాలోని 16 స్థానాలు, గుంటూరులోని 17 నియోజకవర్గాలు కూటమి వశం అయ్యాయి. రాజధాని విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరుకు సమాధానంగా ఫలితాలు ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ప్రకాశం- నెల్లూరు
2019 జగన్ మోహనరెడ్డి జనసునామీలో నెల్లూరులో తెలుగుదేశం పూర్తిగా వాష్ అవుట్ అవ్వగా.. ఇప్పుడు 9చోట్ల కూటమి- 1 చోట వైసీపీ నిలిచింది. వైసీపీ బలంగా ఉండే ప్రకాశం జిల్లాలో కూడా రెండు చోట్ల మాత్రమే వైఎస్సార్సీపీ గెలుస్తోంది.