Elections 2024 Nominations Withdrawal : ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడవు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లు నమోదయ్యాయి. కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు, రెబెల్స్ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. చివరి క్షణంలో టిక్కెట్ మార్చడంతో రెబల్ గా నామినేషన్ వేసిన మడకశిర టీడీపీ నేత సునీల్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే మాడుగుల నుంచి చివరి క్షణంలో బండారు సత్యనారాయణమూర్తిని ఖరారు చేయడంతో మొదట అభ్యర్థిగా ఖరారు చేసిన పైలా ప్రసాద్ కూడా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నూజివీడు టీడీపీ రెబల్ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా పోటీ నుంచి విరమించుకుని టీడీపీలో చేరిపోయారు.
కొన్ని చోట్ల టీడీపీ రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. విజయనగరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత బరిలో ఉన్నారు. పలుమార్లు ఆమెతో సంప్రదింపులు జరిపినా ఆమె రెబల్ గా పోటీ చేయడానికే మొగ్గు చూపారు. ఆమెకు గాజు గ్లాస్ గుర్తు ను కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీలోనూ కొన్ని చోట్ల రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం మీద .. ఆముదాల వలస కీలక నేత సువ్వారి గాంధీ నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
అత్యధిక స్థానాల్లో ముఖాముఖి పోరు జరిగే అవకాశం ఉంది. వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులు కొన్ని చోట్ల కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులు ఉన్నారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగిదంి. జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఈ సారి టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అంత బలంగా లేకపోవడం వల్ల.. అతి కొద్ది నియోజకవర్గాల్లోనే రేసులో ఉండే అవకాశం ఉంది. మిగతా అన్ని చోట్ల ముఖాముఖి పోరు జరగనుంది. 21 చోట్ల జనసేన, పది చోట్ల బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు బ రిలో ఉన్నారు. 144 చోట్ల టీడీపీ అభ్యర్థులు రంగంలో నిలిచారు.
పార్లమెంట్ సీట్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో రెబల్స్ గా ఎక్కడా ఎవరూ బరిలోకి దిగలేదు. టీడీపీ తరపున కానీ.. వైసీపీ తరపున కానీ ఎంపీ అభ్యర్థులు రెబల్స్ గా లేరు. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎవరూ రెబల్స్ లేరు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ తెలంగాణలో త్రిముఖ పోరు జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు హోరాహోరీ తరపడనున్నారు.