Anantapur News: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఎన్నికల్లో అసంతృప్తులు బెడద ఇంకా పార్టీలను వదలడం లేదు. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలు విడుదలైనప్పటికీ ఆశావాహులు ఇంకా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆపడం లేదు. ముఖ్యంగా కూటమి పార్టీల్లో ఈ తలనొప్పి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా అనంతపురం(Anantapuram) తెలుగుదేశంలో ధిక్కార స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్తులను శాంతింపజేసినా ఇక్కడ మాత్రం బుసలు కొడుతూనే ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాలుగో జాబితాలో అనంతపురం అర్బన్(Anantapuram Urban ) టికెట్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి(Vykuntam Prabhakar Chowdary ) కాదని దగ్గుబాటి వేకటేశ్వర ప్రసాద్(Daggubati Venkateswara Prasad )కు కేటాయించారు. దీంతో అనంతపురం అర్బన్‌లో నిరసనలు మిన్నంటాయి. అనంతపురం అర్బన్ టిడిపి ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి టికెట్ ఇవ్వకపోవడంపై అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నేతకు చంద్రబాబు మొండిచేయి చూపారని మండిపడ్డారు.
నిరసనలతో ప్రారంభమైన ఆగ్రహం రాజీనామాల వరకు వెళ్లింది. వైకుంఠం ప్రభాకర్ చౌదరి అనుచర వర్గం టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. జిల్లాలోని పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఇంటి దగ్గర సైతం పెద్ద ఎత్తున నిరసనలు చేసి వైకుంఠం ప్రభాకర్ చౌదరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధినేత తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే అనంతపురం అర్బన్ టిడిపి స్థానం గెలుపు పై ఆశలు వదులుకోవాలని గట్టిగా హెచ్చరించారు.
మరోవైపు ప్రభాకర్ చౌదరి అనుచర వర్గం పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీలో ఉంటారా లేక పార్టీ మారతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
అనంతపురం అర్బన్ టికెట్ ప్రకటించకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎబిపి దేశంతో తెలిపారు. ఈ విషయంపై అధినేత చంద్రబాబు మరోసారి పునర్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పార్టీ తరఫున ప్రభాకర్ చౌదరిని కలిసి బుజ్జగించారు. తెలుగుదేశం పార్టీలో ఇన్నేళ్లుగా రాజకీయాలు చేస్తున్నాని వాపోయారు. గత ఐదేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం తనపై తన అనుచరులపై ఎన్నో కేసులు బనాయించినా వెనక్కి తగ్గకుండా పని చేశామన్నారు ప్రభాకర్ చౌదరి.
వ్యాపారాల పైన కూడా వైసిపి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేయడంతో పార్టీ కోసం వాటిని సగం ధరకే అమ్మేసుకున్నానని ప్రభాకర్ చౌదరి తెలిపినట్లు సమాచారం. పార్టీ కోసం ఇంత కష్టపడినా తనకు కాకుండా మరో వ్యక్తికి అనంతపురం అర్బన్ టికెట్ ఎలా కేటాయిస్తారని ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ప్రతిపక్షంలో కోట్లు ఖర్చుపెట్టి క్యాడర్‌ను పక్కకి వెళ్లకుండా చూసుకున్న తనకు ఆఖరి నిమిషంలో ఇలా చేయటం కరెక్టేనా అంటూ నిలదీశారు.
ఇండిపెండెంట్ గా బరిలోకి ?
చంద్రబాబు అనంతపురం అర్బన్ టికెట్ పై పునరాలోచన చేయాలని ప్రభాకర్ చౌదరి సానుభూతిపరులు చంద్రబాబుకు వినతులు పంపించారు. అనంతపురం అర్బన్ టికెట్‌ను వైకుంఠ ప్రభాకర్ చౌదరి కేటాయించాలని లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని తెలిపారు. భవిష్యత్తు కార్యాచరణ పై వైకుంఠం ప్రభాకర్ చౌదరి పలు దపాలుగా క్యాడర్, సానుభూతిపరులతోను మీటింగ్‌లు పెట్టుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని కూలంకుషంగా చర్చిస్తున్నారు. పార్టీలోనే ఉండాలా లేక పార్టీ మారాలా అన్నదానిపై ప్రధానంగా చర్చ వచ్చినట్లు తెలుస్తోంది.
వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాత్రం పార్టీలోనే ఉంటా అని తెలిపినప్పటికీ ప్రభాకర్ చౌదరి సానుభూతిపరులు ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.
చంద్రబాబు పునర్ ఆలోచన చేస్తున్నారా?
కొన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాల మార్పుపై టిడిపి అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో నరసాపురం, ఏలూరు పార్లమెంటు అభ్యర్థుల బదలాయింపుపై బిజెపితో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అనపర్తి అనంతపురం అర్బన్‌తోపాటు తంబాలపల్లిలో తీవ్ర అసంతృప్తి ఎగసిపడడంతో టికెట్ల కేటాయింపుపై రీ సర్వే చేస్తారని ప్రచారం. దీంతో అనంతపురం అర్బన్ టికెట్ మార్పుపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. .