Who is the Secunderabad BRS candidate : సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌,  బీజేపీ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి.  బీఆర్‌ఎస్‌లో అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. మరోసారి గెలిచేందుకు కిషన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.   ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పేరును ఖరారు చేస్తూ అధిష్టానం గురువారం ప్రకటించింది. అయితే, మొన్నటివరకు బొంతు రామ్మోహన్‌, ప్రముఖ విద్యావేత్త విద్యా స్రవంతిలో ఒకరికి ఖచ్చితంగా టికెట్‌ అని ప్రచారం సాగింది. బీఆర్‌ఎస్‌లో పద్మారావు, ఎడ్ల సుధాకర్‌ రెడ్ది, నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా రోజుకో పేరు బయటకు వస్తోంది.


కిషన్‌ రెడ్డికి దీటైన అభ్యర్థి కోసం వెతుకులాట!


సికింద్రాబాద్‌ నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన ఇప్పటికే ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ బీజేపీకి చెక్‌ పెట్టేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ భారీ కసరత్తులో ఉన్నాయి. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కిషన్‌రెడ్డిని ఓడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్‌ కృతనిశ్చయంతో ఉంది. అందుకే పార్టీ ఫిరాయించిన దానం  నాగేందర్ కు చాన్సిచ్చారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఖరారు చేయలేకపోతోంది.  కవిత అరెస్టు కారణంగా.. సన్నాహాలు ఆలస్యమవుతున్నాయి.             


అభ్యర్థి ఎంపికలో రోజుకో మలుపు
 
కాంగ్రెస్ పార్టీలో మొన్నటి వరకు సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ సీటు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌కే అని ఊహాగానాలు వెలువడటమే కాదు.. ఆయన ప్రచారం సైతం చేసుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా దానం పేరును జాబితాలో చేర్చి ప్రకటించింది అధిష్టానం.  టికెట్‌ తనకే వస్తుందన్న ఆశతో ఉన్న బొంతు రామ్మోహన్‌కు నిరాశే ఎదురైంది. ఇక మిగిలింది బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఎంపికనే. కొన్నిరోజుల వరకు తలసాని ఫ్యామిలీకే అని ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు పద్మారావు గౌడ్‌ లేదా వారి ఫ్యామిలీలో ఒకరికి టికెట్‌ ఖచ్చితమని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. ఒకవేళ పద్మారావు గౌడ్‌ ఎన్నికల్లో పోటీకి సుముఖత చూపని పక్షంలో అంబర్‌పేట్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌ రెడ్డి, మాజీ హౌంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు రాంనగర్‌ మాజీ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌ రెడ్డి పేర్లను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరిశీలిస్తున్నట్టు సమాచారం.  పద్మారావునే ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు భారీ ఆధిక్యత


అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు భారీ ఆధిక్యత వచ్చింది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఆరింటిలో బీఆర్ఎస్ గెలిచింది. ఒక దాంట్లో మజ్లిస్ గెలిచింది. మొత్తం ఓట్ల ప్రకారం చూస్తే.. బీఆర్ఎస్ లక్షా 83 వేల ఓట్ల ఆధిక్యం సాధించింది. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. సికింద్రాబాద్ పై బీఆర్ఎస్ నేతలు నమ్మకం పోగొట్టుకుంటున్నారు. అందుకే పోటీకి వెనక్కి  తగ్గుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.  లోక్ సభ ఎన్నికల ఎజెండా వేరు కాబట్టి ఓటర్ల ఓటింగ్ ప్రయారిటీ కూడా వేరుగా ఉంటుందని అనుకుంటున్నారు.