Warangal MLC Election Results Update: వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తొలి ప్రాధాన్య ఓట్లలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna), ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య టఫ్ ఫైట్ కొనసాగింది. గెలుపు కోటా (చెల్లిన ఓట్లలో 50 శాతానికంటే ఒక ఓటు ఎక్కువ)గా పరిగణించే ఓట్లు 1,55,095 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు అధికారులు రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 42 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఈ అభ్యర్థుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు షేర్ అవుతున్నాయి. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,23,709 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 1,04,846 ఓట్లు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం తీన్మార్ మల్లన్న 19 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ, స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ తర్వాత కూడా ఆధిక్యంలో ఉండడంతో మల్లన్న గెలుపు ఖాయమని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొద్ది గంటల్లో విజేత ఎవరనేదానిపై స్పష్టత రానుంది. 


ఎలిమినేషన్ ప్రక్రియ ఇలా.!


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యతలో గెలుపు కోటాకు సరిపడా ఓట్లు ఏ అభర్థికీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియలో రెండో ప్రాధాన్య ఓటును లెక్కించడం ద్వారా విజేతను నిర్ణయిస్తారు. పోటీ చేసిన మొత్తం అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్య ఓట్లు అతి తక్కువగా వచ్చిన వారిని తొలుత గుర్తిస్తారు. వారి బ్యాలెట్ పత్రాల్లో రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వచ్చిందో వాటిని ఆ అభ్యర్థికి జమ చేస్తారు. అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని లెక్కింపు ప్రక్రియ నుంచి క్రమ పద్ధతిలో తప్పిస్తారు. దీన్ని ఎలిమినేషన్ ప్రక్రియ అంటారు. రిటర్నింగ్ అధికారి సూచన మేరకు అభ్యర్థులు సాధించిన ఓట్ల ఆధారంగా ఆరోహణ క్రమంలో జాబితాను తయారుచేశారు. వారందరికీ సమాచారం ఇచ్చి ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. కాగా, ఈ ఎన్నికల్లో 3,36,013 ఓట్లు నమోదు కాగా.. 25,824 ఓట్లను చెల్లనవిగా అధికారులు నిర్ధారించారు. వీటిలో తొలి 3 స్థానాల్లో ఉన్న వారివే ఎక్కువగా ఉన్నాయి. తొలి రెండు రౌండ్లలోనేే 15,126 ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. చాలామంది ఓటర్లు నచ్చిన అభ్యర్థి పక్కన గడిలో నెంబర్లు వేయాల్సి ఉండగా.. రైట్ మార్క్ చేయడం, అభ్యర్థి ఫోటోపై సంతకం, ప్రాధాన్యతను తెలిపే సంకేతాన్ని తెలుగు, ఆంగ్లంలో రాయడం, కొన్నిచోట్ల 'జై తెలంగాణ', 'జై కాంగ్రెస్' వంటి నినాదాలు రాయడంతో ఎక్కువ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ క్రమంలో పట్టభద్రులు కూడా ఇలా చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.


Also Read: Telangana MPs: పార్టీలు మారినా ఫేట్ మారలేదు, జంపింగ్ నేతలకు తప్పని ఓటమి - ఆ అదృష్టం ఒక్కరికే!