TVK Chief Vijay తమిళనాడు పొలిటికల్ సినిమా అనూహ్య మలుపులు తిరుగుతోంది. థ్రిలర్ సినిమాలకు అలవాటు పడిన జనాలకు అంతకు మించిన కిక్ తమిళనాడు పాలిటిక్స్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు తెరపై కనిపించని సీన్స్ తమిళనాడులో రియల్‌గా జరుగుతున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకున్న టీవీకే చీఫ్ విజయ్, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి మాత్రం కాలం, పార్టీలు కలిసి రావడం లేదు. తగిన సంఖ్యా బలం చూపిస్తేనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని గవర్నర్ చెబుతుంటే, నా సత్తా ఏంటో అసెంబ్లీ ఫ్లోర్‌లో చూద్దురుగానీ అంటూ విజయ్ రిప్లై ఇచ్చారు. దీనిపై గవర్నర్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. అనుకూలంగా రాకుంటే దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని టీవీకే ప్రయత్నాలు చేస్తోంది.
గవర్నర్‌తో విజయ్ భేటీ
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని చాలా పార్టీ మద్దతు తనకు ఉందని గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీలో విజయ్ చెప్పారు. చాలా మంది బహిరంగంగా మద్దతు ఇస్తూ లేఖలు ఇచ్చేందుకు అంగీకరించకపోయినా అసెంబ్లీలో మాత్రం కచ్చితంగా తనతో కలిసి వస్తారని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని జరిపిస్తే అసెంబ్లీలో తన బల నిరూపణ చేసుకుంటాని ఆయనకు వివరించారు. లోక్‌భవన్ అధికారులకు విజయ్ రిక్వస్ట్ లేఖను సమర్పించారు. ఇప్పుడు వారి నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో విజయ్ పార్టీ
విజయ్ రిక్వస్ట్‌ను అంగీకరించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు అంగీకరిస్తారని టీవీకే నేతలు అనుకుంటున్నారు. అలా కాకుండా బలం ఎంత ఉందో చూపించాలని పట్టుబడితే ఈ విషయంపై న్యాయపోరాటం చేయాలని చూస్తున్నారు. ఎన్నికల్లో అత్యధిక సీట్లు వచ్చిన పార్టీగా తనకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని చర్చలు జరుపుతున్నారు. అంటే ఇది ఒక రకంగా గవర్నర్‌తో ఢీ కొట్టేందుకు విజయ్ సిద్ధమవుతున్నట్టు లెక్క. అదే జరిగితే తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తిగా మారబోతున్నాయి.
ఆన్‌లైన్ ఉద్యమం
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండా విజయ్‌ను అడ్డుకుంటున్నారని ఆయన అభిమానులు, టీవీకే శ్రేణులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు వస్తే మాత్రం తమిళనాడు మాత్రం జల్లికట్టు కోసం చేపట్టిన ఉద్యమం లాంటి మరో పోరు చూస్తుందని హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా ప్రాంతాల్లో భారీగా భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించింది. అల్లర్లు, ఆందోళనలకు అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.
డీఎంకే, ఆన్నాడీఎంకే చర్చలు
విజయ్ మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు అన్నాడీఎంకే, డీఎంకే చర్చలు జరుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది అసాధ్యమే అయినప్పటికీ రాజకీయాల్లో ఇలాంటివి జరగడం సహజమని అంటున్నారు. ఈ ప్రచారాన్ని ఖండించేందుకు స్టాలిన్ ఒక కీలక ప్రకటన చేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు కలిగించబోమని అన్నారు. ఆయనకు ఆరు నెలల సమయం ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేనందున విజయ్ మ్యానిఫెస్టో అమలు అసాధ్యమని, అందుకే డీఎంకే పథకాలను కొనసాగించాలని సూచించారు.
