Telangana News: ములుగు: కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక ఎస్సీ, ఎస్టీ, ఒక మహిళ, ఓసీ సీఎం కావొచ్చన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క (Sitakka). హైకమాండ్ ఆదేశిస్తే సీఎం పదవి చేపడుతానన్నారు. బీఆర్ఎస్ (BRS) గెలిస్తే కేసీఆర్ కుటుంబసభ్యులే సీఎం అవుతారని అన్నారు. వరంగల్ జిల్లాలో 8 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 50వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క. తన బలం, బలహీనత మొత్తం పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలేనన్నారు. 2వందల కోట్లు ఖర్చు పెట్టయిన సరే ఇవాళ సీతక్కను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.  ఎక్కడెక్కడో నుంచి వచ్చిన అధికార పార్టీ నేతలు ములుగులో తిష్ట వేశారని అన్నారు. కరోనా వచ్చినపుడు, కష్టం వచ్చినపుడు, వరదలు వచ్చినపుడు, ఇళ్లు కాలిపోయినపుడు రాలేదని అన్నారు. మనుషులు చనిపోయినపుడు రాని మనుషులు ఇవాళ ఓట్ల కోసం రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టేందుకే సిద్ధపడుతున్నారని అన్నారు.


ప్రజలకు సేవ చేయడానికి, ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న ఆమె, తాను సుఖపడటానికి రాజకీయాల్లోకి రాలేదని ఆ విషయం నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో భారీగా మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉన్నప్పటికీ, వేవ్ అంతా కాంగ్రెస్ వైపే ఉందని, ప్రజలకు కూడా ఈ విషయం అర్థమైందన్నారు. ప్రతి ఒక్కరు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని తెలిపారు. పేదలకు ఇళ్లు కట్టించింది, భూములు పంచింది కాంగ్రెస్ పార్టీయేనన్న సీతక్క..పోడు భూముల చట్టాలు తెచ్చింది,ఏడు విడతలు బడుగు,బలహీన వర్గాలకు భూమలు పంచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పంచిన భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటోందన్నారు. 


చదువుకున్న విద్యార్థులంతా నిరుద్యోగులుగా ఉన్నారని, పదేళ్లలో ఒక్క ఉద్యోగం రాలేదని మండిపడ్డారు. పిల్లలను చూసి తల్లిదండ్రుల గుండెలు తరుక్కుపోతున్నాయని, నిరుద్యోగ యువత కూడా కాంగ్రెస్ కు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి హామీ ఇస్తే మడమ తిప్పకుండా అమలు చేస్తుందని, గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పరని, దేశంలో కోట్లమందికి ఇందిరమ్మ ఇళ్లు కట్టించిందని గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి సొంత ఇల్లు లేకపోయినా పేదలకు 6లక్షల రూపాయల వ్యయంతో ఇళ్లు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ మాట ఇస్తే మాట మీద నిలబడుతుందని, ఆనాడు రుణమాఫీ అని చేసి చూపించారన్న సీతక్క, ఉచిత అని చెప్పి అమలు చేసి చూపించిందన్నారు. పేదలకు 185 రూపాయలకు 9 రకాల సరుకులు ఇచ్చిన ఘనత హస్తం పార్టీదేనన్న సీతక్క, ఇవాళ నూనె పాకెట్ 2వందలు, పప్పు పాకెట్ 2వందలు ఉందన్నారు. ఇవాళ పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు పెడుతున్నారని విమర్శించిన ఆమె, ఒక లైట్ ఉన్న వారికేమో బిల్లు వేస్తున్నారని, ఫామ్ హౌస్ లు కట్టుకున్నవారికేమో కరెంట్ బిల్లు లేవన్నారు. 


ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని, ప్రతి మహిళ ఖాతాలోకి 2,500 వేస్తామని, ఉచిత కరెంట్ ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ఉన్నపుడు 5వందలకే గ్యాస్ వచ్చేదని, ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే 5వందలకే సిలిండర్ ఇస్తామన్నారు. కేసీఆర్ లాగా లక్షల కోట్లు అవినీతికి పాల్పడలేదని, ఏ సమావేశానికి పోయినా కాంగ్రెస్ నే తిడుతున్నారని అన్నారు. మొన్నటి వరకు వీళ్ల పని అయిపోయిందని అన్నారని, తమలాంటి వారు అమ్ముడు పోకుండా నిలబడ్డామని, తమ లాంటి వారు ఎదురు తిరిగితే డబ్బు తీసుకొచ్చి ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లక్ష కోట్ల ప్రజాధనాన్ని తీసుకెళ్లి నీళ్లలో పోశారని సీతక్క విమర్శించారు. నెహ్రూ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు 60 ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదని గుర్తు చేశారు. వర్షాలు పడి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కథ అంతా బయటకు వచ్చేందన్నారు. అవినీతి జరిగిందని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెబుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.