రాను రాను ఎన్నికలు ఎంత కాస్ట్లీ అయిపోతున్నాయో చెప్పడానికి తెలంగాణ ఎన్నికలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసులకు భారీగా నగదు, బంగారు, వెండి, లిక్కర్ దొరుకుతోంది. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ క్షణం నుంచి పోలీసులు కూడా డబ్బుల పంపిణీ, ఇతర ప్రలోభాలపై దృష్టి పెట్టారు. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. 


తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చి వారం రోజులు అవుతుంది. ఈ వారంలో రోజుల్లో లెక్కల్లోకి రాని నగదు, ఇతర సొత్తు భారీగానే పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ నలువైపుల మోహరించి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా సొత్తు లభిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే 101,18,17, 299 రూపాయలను పట్టుకున్నారు. 


వారం రోజుల్లో పట్టుకున్న సొత్తు గత ఎన్నికల్లో మొత్తంగా పట్టుకున్న దానికి సమానం. గతం ఎన్నికల్లో పోలింగ్‌ జరిగే వరకు పట్టుకున్న సొత్తు 103కోట్ల 89 లక్షల 22 వేల 753 రూపాయలుగా చెప్పారు. ఇందులో కేవలం నగదు 97 కోట్ల 33 లక్షల 61 వేల  72 రూపాయలు. ఇప్పుడు పట్టుకున్న 101 కోట్లలో లెక్కలు చూపని నగదే 55 కోట్ల 99 ల‌క్షల, 26వేల 994 రూపాయలుగా అధికారులు చెబుతున్నారు. 






2018 అసెంబ్లీ ఎన్నికల్లో 2కోట్ల 38 లక్షల 22 వేల 184 రూపాయల వర్త్ ఉన్న లిక్కర్ పట్టుకుంటే ఈ 2023 ఎన్నికల్లో కేవలం 8 రోజుల్లోనే 2 కోట్ల 60 లక్షల 57 వేల నాలుగు రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల విషయానికి వస్తే గత ఎన్నికల్లో 42 లక్షల 21 వేల 802 రూపాయలుగా ఉంటే అది ఇప్పుడు ఏడు రెట్లు పెరిగింది. 3 కోట్ల 42 లక్షల 84 వేల 275 రూపాయలుగా తేల్చారు. గతంతో పోల్చుకుంటే ఇది ఎంతలా పెరిగిందే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 


ప్రస్తుతం లభించిన బంగారం, వెండి సొత్తు విషయంలో మైండ్ బ్లాంక్‌ అయ్యే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంతో పోలిస్తే సుమారు 13 రెట్లు పెరిగింది. గతంలో మూడు కోట్ల 21 లక్షల 58 వేల 130 రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుంటే ఈ ఒక్క 8 రోజుల్లోనే 38కోట్ల 45 లక్షల 44 వేల 526 రూపాయల సొత్తు దొరికింది. ఇది ఇంకా ఎన్ని రికార్డులు దాటిపోతుందో చెప్పలేమంటున్నారు అధికారులు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇచ్చే ఉచితాలు కూడా గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. 5 లక్షల 28 వేల 955 రూపాయల విలువైన సరకు స్వాధీనం చేసుకుంటే ఈసారి 70 వేల 4 వేల ఐదు వందల రూపాయలుగా తేల్చారు.