Telangana Lok Sabha Elections 2024: తెలంగాణలో ముగిసిన పోలింగ్ - ప్రశాంతంగా సాగిన ఓటింగ్ ప్రక్రియ
Telangana Lok Sabha Election 2024 Voting Live Updates: తెలంగాణలో లోక్ సభ సమరానికి సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు.
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో సాయంత్రం 5 గంటల వరకూ 47.88 శాతం నమోదైంది. హైదరాబాద్ లో 39 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 53.15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
కామారెడ్డి జిల్లా దోమకొండ ముత్యంపేటలో బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై నిలబడ్డ తమపై ఎస్సై దాడి చేశారని.. నిరసిస్తూ పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు ఆందోళన చేశారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జగిత్యాల జిల్లాలో ఓ ఓటరు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే వ్యక్తి ఓటు వేస్తూ సెల్ఫీ తీశారు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు సదరు ఓటరుపై కేసు నమోదు చేశారు.
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుండగా.. ఓటింగ్ చివరి దశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకూ 61.16 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది.
కామారెడ్డి జిల్లా పిప్రియాల్ తండాలో సాయంత్రం 3 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి తండా వాసులు పోలింగ్ బహిష్కరించగా.. అధికారులు నచ్చచెప్పడంతో ఓటు వేసేందుకు సాయంత్రం వచ్చారు. కాగా, సమస్యలు పరిష్కరించలేదని గిరిజనులు ఓటింగ్ బహిష్కరించారు.
హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఒకే రూట్ లో మాధవీలత, ఒవైసీ పోలింగ్ కేంద్రాలు పరిశీలిస్తున్నారు. రెండు వాహనాలు ఒకే రూట్ లో రావడంతో గందరగోళం నెలకొంది. ఇరుపార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మాధవీలతకు వ్యతిరేకంగా కొందరు యువకులు నినాదాలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు యువకులను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఇరువురు నేతలను అక్కడి నుంచి పంపించేశారు. అయితే, పోలీసుల తీరుపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో 5 ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సమస్యాత్మక ప్రాంతాలైన సిర్పూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారిని ఓటేసేందుకు అనుమతి ఇస్తారు.
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 52 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ లో పోలింగ్ తక్కువగా నమోదవుతుండగా.. పాతబస్తీలో ఎన్నికల సిబ్బంది, కొందరు స్థానిక నేతలు ఇంటింటికీ తిరుగుతూ తలుపులు కొట్టి మరీ ఓటర్లను పిలుస్తున్నారు. అంతా ఓటు వేసేందుకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.
మహబూబ్ నగర్ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లతాండా పోలింగ్ బూత్ 160లో బాలకృష్ణ అనే ఓటర్ ఓటు వేసే దృశ్యాలను మొబైల్ లో వీడియో తీశాడు. తన తండ్రి గ్రామ పంచాయతీ సిబ్బంది కావడంతో ఫోన్ తో పోలింగ్ బూత్ లోకి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఓటు వేసిన వీడియోను సదరు ఓటరు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది అభ్యంతరం తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వేదాంతపురంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వెళ్తుండగా కాశి వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందారు. అలాగే పేరాయిగూడెంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో శ్రీకృష్ణ మృతి చెందారు.
తెలంగాణలోని నేషనల్ హైవేపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో మొబైల్ టిఫిన్ సెంటర్‌ను అతివేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు డీకొట్టింది. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలు కాగా.. పలువురిని ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ లో 20 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్ స్లిప్పులు పరిశీలించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేశామని.. సీఎం రేవంత్ పై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని.. ఒంటిగంట వరకూ రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో 50 శాతం ఓటింగ్ నమోదైనట్లు చెప్పారు.
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో మహిళల బురఖా తొలిగించి పరిశీలించడంపై అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
జనగామలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. యువజన కాంగ్రెస్ నేత ప్రశాంత్ రెడ్డి పోలింగ్ సరళి చూసేందుకు రాగా.. బీఆర్ఎస్ ఏజెంట్ అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే పల్లా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని రామ్ నగర్ లో ఉన్న జీవి హైస్కూల్ పోలింగ్ బూత్ నెంబర్ 234 లో తమ ఓటు వేశారు.
ప్రముఖ షట్లర్ జ్వాలాగుత్తా హైదరాబాద్ లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ పై ఈసీకి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ ఫిర్యాదు చేశారు. కొడంగల్ లో ఓటు వేసిన అనంతరం సీఎం రేవంత్ ప్రెస్ మీట్ పెట్టడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. ఓటు వేసిన తర్వాత రాజకీయపరమైన అంశాలు మాట్లాడారని.. ప్రధాని మోదీపై, బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈసీ నిబంధనలను సీఎం ఉల్లంఘించారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ లను సందర్శిస్తూ స్వయంగా ఐడీ కార్డులు తనిఖీ చేశారు. బురఖా వేసుకున్న వారి దగ్గరకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. కాగా, ఉదయం ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, ఉదయం నుంచి నగరంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది.
నిజామాబాద్ లో ఎన్నికల అధికారితో ఎంపీ ధర్మపురి అర్వింద్ వాగ్వాదానికి దిగారు. కొందరు ఓటర్లు బుర్ఖా వేసుకుని ఓటు వేస్తున్నారని వారు సరైన ఓటరేనా కాదా అనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.
నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలంపూర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణంలోని హరిజనవాడ జడ్పీ హైస్కూల్ లో ఓటు వేశారు.
జనగామ జిల్లాలో ఓటర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు. జనగామ మండలం గఘన్ పహాడ్ పోలింగ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. దీంతో ఓటర్లు ఆందోళన కు దిగారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్ లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. మృతుడు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్. ఈ క్రమంలో విషాదం నెలకొంది.
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకూ రాష్ట్రంలో 24.31 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ అధికారులు తెలిపారు.
మంత్రి సీతక్క తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలోని పోిలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ నందినగర్ లో పోలింగ్ కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంబిటల్ స్కూల్ లో తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. హైదరాబాద్ లో ప్రముఖ నటుడు మోహన్ బాబు, నాగచైతన్య, మంచు మనోజ్, విష్ణు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి దంపతులు, దర్శకుడు రాఘవేంద్రరావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటుడు కోటా శ్రీనివాసరావు సైతం జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రెబల్లె గ్రామ సర్పంచ్ గుర్రంపై వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుర్రపు స్వారీ అంటే తనకు చాలా ఇష్టమని.. స్పెషల్ గా ఉంటుందని ఇలా ఓటు వేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్ సాగుతోంది. ఓటు వేసేందుకు నగరవాసులు ఆసక్తి చూపడం లేదు. తొలి 2 గంటల్లో అత్యల్పంగా హైదరాబాద్ లో 5.06 శాతం ఓటింగ్ నమోదైంది. అటు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలోనూ మందకొడిగా పోలింగ్ సాగుతోంది.
కరీంనగర్ లో బీజీపీ నేత బండి సంజయ్ కుటుంబంతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. తొలి 2 గంటల్లో 9.48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్ మండలం రాయమదారం గ్రామ ప్రజలు పోలింగ్ బహిష్కరించారు. ఎన్ఎస్పీ కాలువపై బ్రిడ్జి నిర్మించలేదని.. వంతెన నిర్మాణం చేపట్టాలని నిరసన తెలిపారు. అటు, యాదాద్రి జిల్లా కనుముక్కలలో తడిసిన ధాన్యంతో రైతులు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ధాన్యం బస్తాలతో పోలింగ్ కేంద్రం వద్ద ధర్నా చేశారు. ధాన్యం కొనుగోలు చేస్తేనే ఓటేస్తామని నిరసన తెలిపారు.
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఎస్ఆర్ నగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అర్వింద్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఎస్ఆర్ నగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అర్వింద్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చింతమడక పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో ప్రముఖ దర్శకుడు తేజ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అందరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్లబ్ లోని పోలింగ్ కేంద్రంలో ఆయన తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బర్కత్ పురాలో వారు ఓటు వేశారు.
మెగాస్టార్ చిరంజీవి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అటు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, అల్లు అర్జున్ సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు, మల్కాజిగిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మేడ్చల్ మండలం పూడూరులో ఓటు వేశారు.
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ సలీంనగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేసేందుకు ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే కేంద్రంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 17 లోక్ సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు కొన్ని చోట్ల అరగంట ముందే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు.
Background
Telangana Lok Sabha Election 2024 Phase 4 polling Live: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. 17 లోక్ సభ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ ప్రారంభం అవుతుంది. అనంతరం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ సాగనుంది. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పిస్తారు.
రాష్ట్రంలో 17 స్థానాల్లో మొత్తం 625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 3.31 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ భద్రత కోసం 73 వేల మందికి పైగా పోలీస్ బలగాలను మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఫోర్సెస్ తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 7 వేల మంది ఇతర రాష్టాల హోంగార్డులతోనూ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
అక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంటారు. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ లో హైఅలర్ట్ ప్రకటించారు. పోలింగ్ కు 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని.. సరిగ్గా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని.. ఓటింగ్ శాతాన్ని పెంచాలని సూచించారు.
ఇదీ ముఖచిత్రం
- తెలంగాణలో మొత్తం ఓటర్లు - 3,32,32,318
- పురుష ఓటర్లు - 1,65,28,366
- మహిళా ఓటర్లు - 1,67,01,192
- ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది - 2,94,000
- భద్రతా విధుల్లో 160 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు, 73 వేల మందికి పైగా రాష్ట్ర పోలీసులు
- మొత్తం బ్యాలెట్ యూనిట్స్ - 1,05,019
బరిలో ప్రముఖులు
తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (సికింద్రాబాద్), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), కాంగ్రెస్ నేత దానం నాగేందర్ (సికింద్రాబాద్), ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల), మాజీ ఐపీఎస్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (నాగర్ కర్నూల్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం) వంటి ప్రముఖులు బరిలో నిలిచారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -