తెలంగాణలో గత రెండు నెలలుగా దద్దరిల్లిన మైకులు మూగబోయాయి. ఎన్నికల ప్రచారం నేడు (నవంబరు 28) సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ముందు 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే ప్రచారం ముగిసింది. ఆ నియోజకవర్గాల్లో సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఎల్లుండి (నవంబరు 30) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 3 న కౌంటింగ్‌ జరిగి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.


2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగింది. నేతల బహిరంగ సభలు, హామీలు ప్రసంగాలతో దద్దరిల్లిన తెలంగాణ పోలింగ్ కు సిద్ధమైంది. దేశ ప్రధాని నుంచి మొదలుకొని ఆయా పార్టీల నేతల వరకు ప్రచారం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాని మోదీతో పాటు వివిధ పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఆయా పార్టీల అగ్ర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి జిల్లాలు సమస్యాత్మక ప్రాంతాలు కావడంతో ఇక్కడ నాలుగు గంటలకే ప్రచారం ముగిసింది. మిగతా చోట్ల ఐదు గంటలకు ప్రచారానికి తెరపడింది.


వరంగల్ జిల్లాలో ఇలా.. 


ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ప్రధానమంత్రి నుండి మొదలుకొని ఆయా పార్టీల అగ్ర నేతలు, ముఖ్యమంత్రులు చుట్టేశారు. పార్టీలన్నీ వారి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నేతలను దింపి ప్రచారం నిర్వహించాయి. బీజేపీ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రచారంలో పాల్గొన్న నేతల లిస్ట్ చూస్తే ప్రధానమంత్రి మోడీ, ఆ పార్టీ అగ్రనేత, హోం మంత్రి అమిత్ షా , కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాగూర్, సాధ్వి నిరంజన్ జ్యోతి, రాష్ట్ర నాయకులు ఈటల రాజేందర్ తో పాటు బిజెపికి మద్దతు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మందకృష్ణ మాదిగలు ప్రచారాన్ని నిర్వహించారు. 


ఇక కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి బిపేస్ బజ్వల్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, అగ్ర నేతలు విజయశాంతితోపాటు రాష్ట్ర నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి ఆ పార్టీ అగ్ర నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 11 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలను కవర్ చేశారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్ లు ఉమ్మడి వరంగల్ జిల్లాను చుట్టేశా ఆయా పార్టీల అగ్రనేతలతో పాటు అభ్యర్థుల సైతం 
నియోజకవర్గంలో ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారంతో చుట్టేశారు. ప్రచార సమయం నేటితో మీయడంతో ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంది.


సైలెంట్ టైం స్టార్ట్ - 144 సెక్షన్
ప్రచారానికి నేటితో తెరపడడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ర్యాలీలు, సభలు, రోడ్ షోలు నిర్వహించకూడదు. ఎన్నికలకు సంబంధించి బహిరంగ హామీలు ఇవ్వకూడదు. నేతలు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. 144 సెక్షన్ అమల్లోకి రానుండటంతో నలుగురు కంటే ఎక్కువమంది ఒకేచోట ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.