Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం చాలా శ్రమిస్తోంది. ప్రస్తుతం ఉన్న లోపాలన్నింటినీ సవరిస్తున్నారు. యువత పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకే ఆఖరి నిమిషం వరకు కూడా ఓటు హక్కు నమోదుకు అవకాశం ఇచ్చారు. 


ఆలస్యంగా ఓటరుగా నమోదు చేసుకున్న వాళ్లకు విలైనంత త్వరగా కార్డులు ఇచ్చేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్‌ 30న పోలింగ్ ఉన్నందున పది రోజులు ముందుగానే గుర్తింపు కార్డులు అందించేందుకు ట్రై చేస్తున్నారు. 
ఈ మధ్య కాలంలో ఓటర్‌గా నమోదు చేసుకున్న వారికి ఓటరు గుర్తింపు కార్డులను మరో పది రోజుల్లో పంపించనున్నారు. స్పీడ్‌ పోస్టు ద్వారా ఆయా వ్యక్తుల అడ్రస్‌లకు పంపిస్తారు. దీని కోసం  ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. వీళ్లను కోఆర్డినేట్ చేయడానికి అజయ్‌ వినాయక్ అనే అధికారిని ప్రత్యేక పరిశీలకుడిలా నియమించారు. 


ఓటరు ఐడీతోపాటు ఈవీఎంలు, ఇతర ఏర్పాట్లపై కూడా అధికారులు సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రాష్ట్ర స్థాయి అధికారులు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు భద్రపరిచే కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా సలహాలు ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టత ఇచ్చారు. 


వీటితోపాటు పోలింగ్‌ బూత్‌ల వద్ద రూల్స్‌పై ఇటీవల కాలంలో చేసిన మార్పులు గురించి కూడా చర్చించారు. ఓటు వేయలేని స్థితిలో ఉన్న ఓటర్‌ వెంట వచ్చే సహాయకుడికి కూడా ఇంక్ మార్క్ పెట్టాలని నిర్ణయించారు. గతంలో ఈ రూల్‌ అమల్లో లేదు. కొత్తగా ప్రవేశ పెట్టారు. అంతే కాదు అదే బూత్‌ ఓటర్‌ మాత్రమే హెల్ప్‌గా రావాలి. అప్పటికే ఓటు వేసిన వ్యక్తి మాత్రమే సహాయకుడిగా వెళ్లాలి. అందుకే ఆయన కుడి చేతి వేలికి ఇంక్‌ మార్క్ పెట్టనున్నారు. 


మాక్‌ పోలింగ్‌ కూడా ఈసారి గంట ముందు నిర్వహించనున్నారు. ఉదయం 5.30కి మాక్‌ పోలింగ్‌ చేపట్టనున్నారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఏ ప్రాంత ఓటరైనా అభ్యర్థి తరఫున పోలింగ్ ఏజెంట్‌గా ఉండొచ్చు. వాళ్లు ప్రజాప్రతినిధులు అయిఉండొచ్చు.