Telangana Assembly Poll 2023: హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections 2023) గెలుపే లక్ష్యంగా పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. విజయం కోసం వ్యూహ, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు, ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ప్రతి రోజు మూడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు. అటు కాంగ్రెస్(Congress) పార్టీ నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా ప్రచారం చేస్తున్నారు. కాషాయ పార్టీ నేతలు వరుసబెట్టి సభలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. ప్రధానమంత్రి మోడీ(Narendra Modi) బీసీ గర్జన(BC Garjana) సభ తర్వాత క్యాంపెయిన్ లో మరింత వేగం పెంచాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పార్టీల అగ్రనేతలు ప్రచారం కోసం హెలికాప్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ విధంగా హెలికాప్టర్ల ద్వారా రాష్ట్రాన్ని చుట్టేసేందుకు రెడీ అవుతున్నారు. 


ముఖ్యమంత్రి(Telangana CM) కేసీఆర్ అన్ని నియోజకవర్గాలను చుట్టేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరించాల్సిన కమలం పార్టీ నేతల స్వరాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి(Kishan Reddy), నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్టైల్ మార్చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిన్నటి వరకు కేసీఆర్, కేసీఆర్ కుటుంబంపై ఒంటి కాలుతో లేచిన నేతలు, ఇపుడు పూర్తి రివర్స్ లో వ్యవహరిస్తుండటంలో ప్రజల్లో కొత్తం చర్చ మొదలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో బిజెపి ఎంపీ అరవింద్, సీఎం కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించడం అందర్నీ ఆశ్చర్యపడేసింది.


ఆరు నెలల క్రితం వరకు తెలంగాణ లో బిఆర్ఎస్–బిజెపిల మధ్యే అసలైన పోటీ ఉంటుందని, ఈసారి బిజెపికే ప్రజలు పట్టం కడతారని అంత భావించారు కానీ ఒక్కసారిగా అంత తారుమారైంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అరవింద్(Aravind Dharmapuri), రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)కంటే సీఎం కేసీఆర్‌ మంచోడని అనడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరోవైపు రాష్ట్రంలో మార్పు అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు కాకూడదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పరిస్థితి అంతేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, అవినీతి, అక్రమాల్లో కవల పిల్లల వంటివని విమర్శించారు. 


బీజేపీ నేతల వాయిసుల్లో మార్పు రావడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఎక్కడా కూడా బీజేపీ నేతలపై విమర్శలు చేయడం లేదు. కాషాయ పార్టీని పల్లెత్తు మాట అనడం లేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ(BJP) ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఇప్పటి దాకా కేసీఆర్ పాల్గొన్న అన్ని సభల్లోనూ ప్రధాని కాంగ్రెస్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఇప్పటికే 60 సంవత్సరాలు అధికారం ఇచ్చారని, మళ్లీ ఆ పార్టీకి ఇస్తే ప్రజలకు నష్టం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శిస్తున్నారు.


కాంగ్రెస్ వస్తే ధరణి(Dharani), రైతుబంధు(Rythubandhu), రైతు బీమా(Rythu Bheema), దళితబంధు(Dalita Bandhu) వంటి పథకాలను తీసి వేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నేతలపై ఎలాంటి విమర్శలు, ఆరోపణలు చేయకపోవడంతో బీజేపీ నేతలు కూడా స్వరం మార్చేశారు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తూ కొత్త రాగం అందుకుంటున్నారు. కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తే కొన్ని సానుభూతి ఓట్లు పడతాయన్న ఆలోచనతో బీజేపీ నేతలు స్వరం మార్చేశారని జనం చర్చించుకుంటున్నారు.