Telangana Elections 2023: బీఆర్‌ఎస్‌లో అసంతృప్తి రాగం.. బాగానే వినిపిస్తోంది. టికెట్‌ దక్కని నేతలు బహిరంగానే తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారు. దీంతో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది పార్టీ అధిష్టానం. అలాంటి నేతలను వెతికి తమ వైపు లాక్కునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయి. అయితే... బుజ్జగింపులు ఫలిస్తాయా? జంపింగ్‌లు పెరుగుతాయా? బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు బీజేపీ, కాంగ్రెస్‌లో ఏ పార్టీలో చేరుతారు? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌.


తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత... టికెట్‌ రాని వారు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. బీఆర్ఎస్‌ను వీడి వెళ్తున్న వాళ్లు కొందరైతే... పార్టీలోనే ఉంటూ రగిలిపోతున్నవాళ్లు మరికొందరు. ఇప్పటికే కొంతమంది రాజీనామా చేయగా... మరికొంత మంది రిజైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.


ఇలా జంపింగ్ జపాంగ్‌ లిస్ట్‌లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు... కీలక నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో బుజ్జగింపుల పర్వం మొదలుపెట్టింది బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం. కీలక నేతలు పార్టీని వీడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అసంతృప్తులు... ప్రతిపక్ష పార్టీలకు వెళ్తే... ప్రత్యర్థులు బలపడే అవకాశం ఉండటంతో.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.


టికెట్‌ రాలేదని ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, ఎవరెవరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని ఆరా తీస్తోంది బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటోంది. ముఖ్యనేతలను రంగంలోకి దింపి... అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేసీఆర్‌ ఆదేశాలతో తుమ్మల ఇంటికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్​రావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు వెళ్లారు. బీఆర్ఎస్​లోనే కొనసాగాలని తుమ్మలను బుజ్జగించారు. కేసీఆర్ త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తారని, తొందరపడి పార్టీని వీడొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక రాజయ్యను బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి రంగంలోకి దిగారు. 


అసంతృప్తులను బుజ్జగించే పనిలో కేసీఆర్‌ ఉంటే... ఎలాగైనా వారిని తమ పార్టీల్లోకి లాక్కునేందుకు గాలం వేస్తున్నాయి కాంగ్రెస్‌, బీజేపీలు. ఇప్పటికే.. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నకిరేకల్ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా బీఆర్‌ఎస్‌ను వీడారు. పెద్దపల్లి నుంచి టిక్కెట్ ఆశించిన నల్ల మనోహర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. పాలేరు టికెట్ ఇవ్వలేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్ దక్కకపోవడంతో... ఎమ్మెల్యే రాజయ్య అయితే కింద పడుకుని మరీ ఏడేశ్చారు. కొత్తగూడెం టికెట్ ఆశించిన జలగం వెంకట్రావు సైతం పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారట. టికెట్‌ రాక బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయాలనుకునే వారంతా... కాంగ్రెస్‌, బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.


ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆసిఫాబాద్‌ టికెట్‌ కోసం గాంధీభవన్‌లో దరఖాస్తు కూడా చేసుకున్నారు. రేఖా నాయక్‌ కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారు. వారం, పది రోజుల్లో ఏ పార్టీలో చేరేంది చెప్తానన్నారు. మిగిలిన బీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్‌, బీజేపీలో ఏ పార్టీ టికెట్‌ ఆఫర్‌ చేస్తే... ఆ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 


బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు ఎక్కువగా కాంగ్రెస్‌ వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ కూడా బీఆర్‌ఎస్‌ నేతలను చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజే... కాంగ్రెస్‌ ఆ ఆపరేషన్‌ మొదలుపెట్టగా... త్వరలోనే భారీగా చేరికలు ఉంటాయని గాందీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి. ఈనెల 26న చేవెళ్లలో జరిగే సభలో... నాయకులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌ అసంతృప్తులపై ఫోకస్‌ పెట్టింది. కానీ... ఈ ఆపరేషన్‌ ఆకర్ష్‌లో కాంగ్రెస్‌దే పైచేయిలా కనిపిస్తోంది.