Vikas Raj On Telangana Elections: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ (Vikas Raj) కీలక సూచనలు చేశారు. ఇక నుంచి సైలెంట్ టైం ఉంటుందని, ఎవరూ ప్రచార కార్యక్రమాలు (Political Advertisements) నిర్వహించకూడదని తెలిపారు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారాలు చేయకూడదని అన్నారు. హైదరాబాద్ లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కేవలం అనుమతి పొందిన ప్రకటనలకు ప్రింట్‌ మీడియాలో మాత్రమే అవకాశం ఉందని స్పష్టం చేశారు.


టీవీలు, రేడియోలు, కేబుల్‌ నెట్‌వర్కుల్లో ప్రచారం (Political Advertisements) పూర్తిగా నిషేధమని అన్నారు. ఓటరుకు ఇచ్చే స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని.. పోలింగ్‌ ముగిసిన అరగంట తర్వాత వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం ఉంటాయని ఎన్నికల కమిషనర్ చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉన్న 1.48 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని వివరించారు.


‘‘రానున్న 48 గంటలు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. ఎలాంటి ఒపీనియన్ పోల్స్ ఇవ్వకూడదు. పోలింగ్ బూత్ ల వద్ద ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. రేపు ఉదయం పోలింగ్ సిబ్బందికి అలెర్ట్ చేస్తున్నాం.. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. మనీ, లిక్కర్ పంపిణీ జరగకుండా సీసీటీవీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నాం. మాక్ పోలింగ్ కోసం 90 నిమిషాల ముందు ఎజెంట్స్ పోలింగ్ స్టేషన్స్ కి రావాలి. 27,178 మంది ఇంటి దగ్గర నుండే ఓటు వేశారు. 1.48 లక్షల మంది ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చాం. పోలింగ్ స్టేషన్ లోపల 27,094 వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. 


పోలింగ్ స్టేషన్ 7,500 వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. 35,655 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాం. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ స్టేషన్ కు అదే విధంగా రిటర్న్ లో ఎక్కడా ఆగకుండా సూచించిన దారిలోనే సిబ్బంది రావాలి. ఓటు వేయడానికి వెళ్లే వారు ఏదైనా కచ్చితంగా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్ళాలి. ఇప్పటిదాకా రూ.770 కోట్లు నగదు సీజ్ చేశాం’’ అని ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు.


ఈవీఎంల తరలింపునకు రూట్ మ్యాప్


‘‘పోలింగ్ సిబ్బంది ఉదయం 5.30 నిమిషాలకు వాళ్ల వాళ్ల కేంద్రాల దగ్గర ఉండాలి. ఈవీఎంలను పోలింగ్ ఏజెంట్ లు ముట్టుకోవద్దు. హోం ఓటింగ్ 27,178 మంది ఓటు వేస్తే దాంట్లో 15,990 మంది సీనియర్ సిటిజన్ ఉన్నారు. 1.48 లక్షల మంది బ్యాలెట్ ఓట్లు వేశారు. ఆ ఓటింగ్ ఇవ్వాళ కూడా జరుగుతుంది.


35 వేల పోలింగ్ కేంద్రాలు, 3300 సెక్టార్ లో ఏర్పాటు చేశాం, ప్రతి సెక్టార్ కు ఒక ఇంచార్జి ఉన్నారు. EVM ల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ తయారు చేశాం. ఎక్కడా ఆగకుండా వెళ్ళాలి. ఓటర్ 12 గుర్తింపు కార్డులలో ఎదైనా చూపించి ఓటు వేయొచ్చు. పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్ అనుమతి లేదు.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూమెంట్, వెహికిల్ ను మానిటరింగ్ చేయాలని డీఈవోలకు ఆదేశాలు ఇచ్చాం. 2018లో పోస్టల్ బ్యాలెట్ 1 లక్ష మంది వేస్తే, ఈసారి 1.5 లక్షలు వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఎక్కడైనా ఐదుగురి కంటే ఎక్కువ గుమిగూడితే కఠినమైన చర్యలు తీసుకుంటాం’’ అని వికాస్ రాజ్ తెలిపారు.