కామారెడ్డి... సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గం. ఇక్కడ ముందు నుంచి కాంగ్రెస్‌కు పట్టుంది. ఈ నియోజకవర్గంలో మైనారిటీలు, బీసీ సామాజిక వర్గాల బలం ఎక్కువ.  ఈసారి సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నుంచి కూడా బరిలో దిగుతుండటంతో... ఎన్నికల సమరం రసవత్తరంగా మారనుంది. కామారెడ్డి.. గతంలో నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ డివిజన్‌గా ఉండేది. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఆరు మండలాలు కాగా.. కామారెడ్డి మున్సిపాలిటీ. కామారెడ్డి, దోమకొండ, బికనూర్, మాచారెడ్డి పాత మండలాలు కాగా..  రాజంపేట, బిపి పేట కొత్త మండలాలు. 1952లో ఏర్పడిన కామారెడ్డి నియోజకవర్గంలో.. 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 8 సార్లు, టీడీపీ ఐదు సార్లు, టీఆర్‌ఎస్‌ 3 సార్లు, ఇండిపెండెంట్లు ఒకసారి గెలిచారు. ఒకసారి ఉపఎన్నిక జరిగింది. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి బీఆర్‌ఎస్‌దే. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ గెలిచారు.  2012 ఉపఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తరఫున గంప గోవర్దన్ గెలిచారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్దన్‌కు 68,167 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ  53,610 ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో గంప గోవర్దన్ 8,557 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 


జుక్కల్‌.. ఇది ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. 1957లో ఏర్పడింది. 1978లో ఎస్సీ రిజర్వుడుగా మార్చారు. జుక్కల్‌ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఈ  నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. వాటిలో నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పిట్లంపాత పాతమండలాలు కాగా... పెద్ద కొడపగల్ కొత్తగా చేరింది. ఇది మంజీరా నది పరివాహక ప్రాంతం. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు కలిగి ఉంటుంది. జుక్కల్‌ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,92,049. వీళ్లలో పురుషులు 94,988, స్త్రీలు  97,061 మంది. గత రెండు ఎన్నికల్లో జుక్కల్‌లో కారు జోరు కొనసాగింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంతు షిండే గెలిచారు. 2009లో హనుమంత్‌ షిండే టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2014 కంటే ముందే పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు టీఅర్ఎస్‌ లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి హనుమంత్  షిండే.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌.గంగారాంపై విజయం సాధించారు. హనుమంత్ షిండేకు 72,901 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.గంగారాంకు 37,394 ఓట్లు వచ్చారు. షిండే 35  వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి హనుమంతు షిండే 77,584 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.గంగారాం 49,959 ఓట్లు సాధించారు. 2023లో కూడా బీఆర్ఎస్ టికెట్ షిండేకు దక్కింది. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు గట్టి పట్టుంది.


బాన్సువాడ... నిజామాబాద్ జిల్లాలోని ఆరు మండలాలు, కామారెడ్డి జిల్లాలోని మూడు మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఏడుసార్లు, టీడీపీ ఆరుసార్లు, టీఆర్ఎస్ మూడుసార్లు గెలిచాయి. బాన్సువాడ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య..  1,87,461. వీరిలో పురుషులు 89,793, స్త్రీలు 97,668 మంది. 2014, 2018లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డిదే విజయం. టీడీపీలో ఉన్నప్పుడు  కూడా పోచారం శ్రీనివాస్‌రెడ్డికి బాన్సువాడ నియోజకవర్గంలో పట్టుంది. 1994 నుంచి 2004 వరకు, 2009 నుంచి 2018 వరకు ఈ నియోజకవర్గం నుంచి పోచారం ప్రాతినిథ్యం వహించారు. మొత్తంగా 5సార్లు గెలుపొందారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుపై విజయం సాధించారు. పోచారం  శ్రీనివాసరెడ్డికి 65,868 ఓట్లు రాగా, 41,938 ఓట్లు లభించాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి 77,943 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి  కాసుల బాలరాజుకు 59,458 ఓట్లు లభించాయి. పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీ హయాంలో మంత్రిగా చేశారు. ఇప్పుడు శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. 2023లోనూ బీఆర్‌ఎస్‌ ఆయనకే టికెట్‌ ఇచ్చింది.


ఎల్లారెడ్డి నియోజకవర్గం.. 1962 నుంచి 1972 వరకు ఇది ఎస్సీ రిజర్వుడ్‌. 1978లో జనరల్ కేటగిరీకి మార్పు చేశారు. ఈ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. వాటిలో ఎల్లారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, సదాశివ నగర్, నాగిరెడ్డిపేట్, గాంధారి పాత మండలాలు కాగా... కొత్త మండలం రామారెడ్డి ఉంది. ఈ నియోజకవర్గ పరిధిలో ఎస్టీ, బీసీ, సామాజిక వర్గాలు బలమైనవి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2014లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌) నుంచి ఏనుగు రవీందర్‌రెడ్డి గెలుపొందగా, 2018‌లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్ గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జాజుల సురేందర్‌కు 92,000 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డికి 56 వేల ఓట్లు వచ్చాయి. జాజుల సురేందర్‌ 36,000 ఓట్ల మెజారిటీలో గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు గాను బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని జాజుల సురేందర్‌కు కేటాయించారు. 2018‌లో కాంగ్రెస్ నుంచి గెలిచిన  జాజుల సురేందర్ బీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో.. ఏనుగు రవీందర్‌రెడ్డి ఈటల రాజేందర్‌రెడ్డితో కలిసి బీజేపీలో చేరారు.