TS New Ministers: తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. త్వరలోనే మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు  చేయబోతోంది. సీఎం అభ్యర్థిపై క్లారిటీ వచ్చిన తర్వాత.. మంత్రి పదువులపై కూడా స్పష్టత రానుంది. సీఎం ప్రమాణస్వీకారంతోపాటే మంత్రివర్గం కూడా బాధ్యతలు స్వీకరించే  అవకాశం కూడా ఉందంటున్నారు విశ్లేషకులు. ముఖ్యమంత్రితో కలిపి 18 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి, ఉప  ముఖ్యమంత్రి కాక.. మరో 16మందికి మంత్రి పదవులు దక్కుతాయి. అయితే కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి  అన్న దానిపై చర్చ జరుగుతోంది.


కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పుపై రోజురోజుకూ ఆతృత పెరిగిపోతోంది. అయితే.. మంత్రి పదవుల కోసం అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం ఆచీతూచీ వ్యవహరిస్తోంది.  సీనియార్టీ, సామాజిక సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుంటోందని సమాచారం. మరోవైపు... పదవుల కోసం కాంగ్రెస్‌లో కొట్లాట తప్పదన్న వాదన ఉంది. అయితే.. ఈసారి  పరిస్థితి రాకుండా... నాయకులకు నచ్చజెప్పి... పరిస్థితి చక్కదిద్దతూ.. అసంతృప్తి చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ... మంత్రి పదవులు ప్రకటించేందుకు కాంగ్రెస్‌  హైకమాండ్‌ కష్టపడుతోంది. గెలిచిన ఎమ్మెల్యేలో సీనియారిటీని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటోందని.. ఆ తర్వాత సామాజిక సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుని మంత్రి  పదవులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.


మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, ఖమ్మం జిల్లాల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఎక్కువ మంది మంత్రి పదవులు ఇవ్వాల్సి అవసరం ఉంది.  గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు, గతంలో ఎంపీలుగా చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రివర్గంలోకి తీసుకునే  అవకాశం కనిపిస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ఈసారి మంత్రిపదవి ఇచ్చే సూచనలు కనిపించడంలేదు. 


కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌.. ఆదిలాబాద్‌ నుంచి వివేక్‌, ప్రేమసాగర్‌రావు, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిగణనలోకి  తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకుడు జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి ఓడిపోయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సీనియార్టీని పరిగణనలోకి తీసుకుని ఆయనకు  కూడా అవకాశం ఇస్తారేమో చూడాలి. ఇక..  మైనార్టీ వర్గం నుంచి పోటీ చేసిన వారంతా ఓడిపోయారు. షబ్బీర్‌అలీని మంత్రివర్గంలోకి తీసుకొని శాసనమండలికి పంపుతారనే  ప్రచారం కూడా ఉంది. మెదక్‌ జిల్లా నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తోందట కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఇక... మహబూబ్‌నగర్‌  జిల్లా విషయానికి వస్తే.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయన్ను మినహాయిస్తే... జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, వంశీకృష్ణ పేర్లతోపాటు షాద్‌నగర్‌ నుంచి  గెలుపొందిన శంకర్‌ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తోందట. 


ఇక... నల్గొండ జిల్లా నుంచి సీనియర్‌ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. ఉత్తమ్‌ ఆసక్తి చూపకపోతే ఆయన భార్య పద్మావతికి మంత్రి పదవి  దక్కే ఛాన్స్‌ ఉంది. వరంగల్‌ నుంచి సీతక్క, కొండా సురేఖ మంత్రి పదువలు రేసులో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్కతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల  నాగేశ్వరరావు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి గడ్డం ప్రసాద్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామమోహన్‌రెడ్డి.. పేర్లు కూడా మంత్రి పదవుల కోసం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.  ఇక... స్పీకర్‌ ఎవరన్నది కూడా తేల్చాల్సి ఉంది. తుమ్మల నాగేశ్వరరావును స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల నుంచి గుసగుసలు  వినిపిస్తున్నాయి. తుమ్మల స్పీకర్‌ పదవికి సరిగ్గా సరిపోతారని... కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారట. మరి స్పీకర్‌ పదవి తీసుకునేందుకు స్పీకర్‌ ఒప్పుకుంటారో లేదో చూడాలి.  ఒకవేళ స్పీకర్‌ పదవికి ఆయన అంగీకరించకపోతే... మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది.