తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తిరుగులేని మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే 65పైగా స్థానాల్లో మెజార్టీ సాధించింది. బీఆర్‌ఎస్‌ 40స్థానాలకు అటు ఇటుంగా ఉండిపోయే అవకాం కనిపిస్తోంది. తెలంగాణలోని రాజధాని పరిసర ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్‌ హవా కనిపించింది. 


కాంగ్రెస్‌ విజయం దిశగా దూసుకెళ్తున్న టైంలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకునే వారు ఎవరు ఎంత ఆధిక్యంలో ఉన్నారో పరిశీలిస్తే... ఈ రేసులో ముందంజలో ఉన్న రేవంత్‌రెడ్డి ఈ సారి రెండు స్థానాల్లో పోటీ చేశారు. అందులో తన సొంత నియోజకవర్గంలో కొడంగల్‌లో లీడింగ్‌లో ఉన్నారు. అదే టైంలో కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేశారు. అక్కడ కూడా రెండు వేలకుపైగా ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. 


భట్టి విక్రమార్క మధిరలో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. అక్కడ ఆయన రౌండ్ రౌండ్‌కు ఆధిక్యం పెంచుకుంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్శ్‌ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గొండి జిల్లాలో వారి పట్టు నిలుపుకున్నారు. అక్కడ ఒక జగదీష్‌ రెడ్డి మినగా మిగతా బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓటమి బాటలో ఉన్నారు. అదే జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. సీతక్క కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి నుంచి ఆమె ఆధిక్యంలో కనిపిస్తున్నారు. 


కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో ఆ పార్టీ శ్రేణులు మునిగిపోయారు. ముఖ్యంగా సీఎం అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న వారి ఇంటి వద్ద సంబరాలు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి నివాసంలో హైదరాబాద్‌లో హడావుడి కనిపిస్తోంది. 


ముందంజలో ఉన్న మంత్రులు వీళ్లే - తిరుగలేని హరీష్‌ 
తెలంగాణలో ఎన్నికల్లో చాలా మంది మంత్రులు పట్టు కోల్పోతున్నారు. ఓటమి దిశగా పయనిస్తున్నారు. ప్రత్యర్థుల కంటే చాలా వెనుకబడి ఉన్నారు. మరికొందరు ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 


కరీంనగర్‌లో మంత్రి గంగుల కమాలకర్‌ మొదట్లో కాస్త వెనుకబడినా తర్వాత పుంజుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో గంగుల పోటీ పడుతున్నారు. నాలుగు రౌండ్‌లు ముగిసే సరికి బండి సంజయ్‌ను వెనక్కి నెట్టి ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లు, మొదటి రెండు రౌండ్లలో బండి సంజయ్‌ కాస్త ఆధిక్యంలో కనిపించారు. కానీ తర్వాత బండి వెనుకబడిపోయారు. ఇక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. 


సూర్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి జగదీష్‌ రెడ్డి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొదట్లో కాస్త తడబాటు కనిపించినా తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆయన తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై పైచేయి సాధిస్తున్నారు. 
మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న మల్లారెడ్డి కూడా ఆధిక్యంలో ఉన్నారు. తన ప్రత్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై పూర్తి స్థాయి మెజార్టీ సాధించారు. 


తిరుగు లేని హరీష్‌రావు 
సిద్దిపేటలో హరీష్‌రావుకు తిరుగు లేదని మరోసారి రుజువైంది. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు నుంచి ఆయన దూసుకెళ్తున్నారు. ఎక్కడా ఆధిక్యం తగ్గలేదు. రౌండ్‌లు పెరుగుతున్న కొద్ది ఆధిక్యంలో పెంచుకుంటూ ఉన్నారు. 


కేటీఆర్‌ ఆధిక్యం 
మంత్రి కేటీఆర్‌ మొదట్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తర్వాత ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. సిరిసిల్లా కేటీఆర్ ఖిల్లా అన్నట్టు ముందంజలో ఉన్నారు. 


మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కూడా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆమె ముందంజలో ఉన్నారు. 
కాంగ్రెస్ హవా ముందు చాలా మంది మంత్రులు వెనుకంజలోకి వెళ్లారు. అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో పోటీ చేశారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మూడో స్థానంల కొనసాగుతున్నారు. 
మరో మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందుంజలో దూసుకెళ్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌ లెక్కింపు దగ్గర నుంచి తుమ్మల హవా కొనసాగుతోంది. 


వనపర్తి నియోజకవర్గంలో పోటీ చేసిన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు. తన ప్రత్యర్థి టి మేఘా రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌ రావు కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి యశస్వి రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. ధర్మపురిలో పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్‌ కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు. తన ప్రత్యర్థి లక్ష్మణ్‌ కుమార్ ముందంజలో ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రశాంత్ రెడ్డి కూడా ఓటమి దిశగా వెళ్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ దూసుకెళ్తున్నారు.