Telangana Elections 2023 Live News Updates: 'కేసీఆర్ పదేళ్ల పాలన అవినీతిమయం' - రాహుల్ గాంధీ
Telangana Election Live News: తెలంగాణ ఎన్నికల ప్రచార వార్తల లైవ్ అప్ డేట్స్ మీకోసం..
తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి, అంథోల్ లో (Sangareddy) నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ పేరుతో పేదల భూములు ఆక్రమించుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు క్యూలో ఎదురు చూస్తున్నారని, పేపర్ల లీక్ తో వారు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) హయాంలో తెలంగాణ (Telangana) ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం తూఫ్రాన్ (Thupran), నిర్మల్ (Nirmal) లోని సకల జనుల సంకల్పం పేరుతో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలనే నడుస్తోందని, రాష్ట్రంలో రూ.కోట్లల్లో ఇరిగేషన్ స్కాం జరిగిందని ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారని, ప్రజల భవిష్యత్ గురించి చింత లేదని ధ్వజమెత్తారు.
మహబూబ్ నగర్: యెన్నం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి పాలమూరు గడ్డ పౌరుషం చూపాలి - టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
మీరు నాటిన ఈ మొక్క వృక్షంగా మారింది, సోనియమ్మ మీ బిడ్డకు పీసీసీగా అవకాశం కల్పించింది..
ఈ వృక్షాన్ని నరకాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్, శ్రీనివాస్ గౌడ్ భుజాన గొడ్డలి వేసుకుని తిరుగుతున్నారు.
ఈ వృక్షాన్ని కాపాడుకునే బాధ్యత మీపై ఉంది..
ఈ గడ్డపై 14 కు 14 సీట్లు కాంగ్రెస్ ను గెలిపించి వారికి బుద్ది చెప్పాలి.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది.
ముదిరాజు బిడ్డలకు కాంగ్రెస్ 3 సీట్లు ఇచ్చింది... కానీ బీఆరెస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదు
బక్కోన్ని అని చెప్పుకునే కేసీఆర్.. లక్ష కోట్లు దోచుకుండు, పదివేల ఎకరాలు ఆక్రమించుకుండు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతుంది.
మార్పు కావాలి... కాంగ్రెస్ రావాలి..
మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ప్రజలకు డబ్బులు పంపిణీ స్లిప్ లు పంచుతున్నారని కవరేజ్ చేసిన మీడియాపై బీఆర్ఎస్ నేత దాడిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి ఖండించారు. జర్నలిస్టులకే రక్షణ లేకపోతే సామాన్యులకు బీఆర్ఎస్ ఏం రక్షణ కల్పిస్తుంది, వాళ్లు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి తన శ్రేణులను నియంత్రించడంతో విఫలమయ్యారని ఆరోపించారు. ఇలాంటి దాడులు ఎవరు చేసిన వాటిని ఉపేక్షించకూడదన్నారు.
మేడ్చల్ లోని గౌడవెల్లి గ్రామంలో జర్నలిస్టు విశ్వపై బీఆర్ఎస్ నేతల దాడిని మేడ్చల్ మండల బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు బచ్చు కృష్ణప్రియ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని గాలికొదిలేసి బీఆర్ఎస్ నేతలు గూండాలుగా మారి సామాన్యులపై, జర్నలిస్టులపై సైతం దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. నగదు పంపిణీకి బీఆర్ఎస్ నేతలు ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇది గుర్తించిన ఓ జర్నలిస్టు ఈ విషయాన్ని కవర్ చేస్తుండగా, సత్తిరెడ్డి అనే బీఆర్ఎస్ నేత దాడికి పాల్పడ్డారు. ఓటమి భయంతో డబ్బులు పంచుతున్నారనా, లేక అధికారం కోల్పోతామని జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారా అని బీఆర్ఎస్ నేతల్ని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టపు చూపులా బోధన్ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి బిర్యాని తిని వెళ్లిపోవాలని సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని, కానీ వాళ్లు ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మండిపడ్డారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ పార్టీ బలితీసుకుందని, ప్రత్యేక తెలంగాణ ఆలస్యం కావడంతో అనేక మంది ఆత్మబలిదానాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడూ శాంతి భద్రతల సమస్య, కర్ఫ్యూలు, మతకల్లోలాలు ఉండేవని, కానీ గత పదేళ్ల సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క శాంతి భద్రతల సమస్య రాలేదని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రశాంతంగా ఉందని, ప్రజలు ప్రశాంతగా జీవిస్తున్నారని చెప్పారు. ప్రశాంతగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పదేళ్ల బీఆరెస్ పాలనలో స్థానిక ప్రజాప్రతిందుల దుస్థితి గురించి లేఖల్ ప్రస్తావించారు. జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తనకు స్థానిక ప్రజాప్రతినిధుల బాధ్యత తెలుసని అన్నారు. ‘‘ఏ ప్రభుత్వ పాలనకకైనా మీరే పునాదులు. పదేళ్ల బీఆరెస్ పాలనలో మీ అవస్థలు.. మీకు జరిగిన అవమానాలు నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని కేసీఆర్ పురుగులకంటే హీనంగా చూశారు. నిర్ణయాధికారం లేక, నిధులు రాక మీరు పడిన బాధలు గుర్తున్నాయి. సర్కారు నిధులు రాకున్నా భార్య మెడలో బంగారం అమ్మి అభివృద్ధి చేసిన వాళ్లు ఉన్నారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి ప్రచారంలో బీఆర్ఎస్ నాయకుల జులుం ప్రదర్శించారు. గౌడవెళ్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యం చూపారు. డబ్బులు పంచుతున్నారని వీడియో కవరేజ్ చేస్తున్న రిపోర్టర్లపై దాడి చేశారు. ప్రచారానికి వచ్చిన వారికి డబ్బుల కోసం టోకెన్ ఇస్తుండగా వీడియో తీస్తున్న మేడ్చల్ ఏబీపీ దేశం ప్రతినిధి విశ్వపై సత్తి రెడ్డి అనే బీఆర్ఎస్ నాయకుడు దాడి చేశాడు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో జరగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. బీఆర్‌ఎస్ నాయకులు భారీ జన సమీకరణ చేస్తున్నారు.
ఈ రోజు ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 10గంటలకు నారాయణపేట్ బహిరంగసభ, ఉదయం 11 గంటలకు దేవరకద్ర బహిరంగసభ, మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్ నగర్ జనసభ, మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి కామారెడ్డి బహిరంగసభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు పఠాన్ చెరులో జనసభ, సాయంత్రం 6.30 గంటలకు శేరిలింగంపల్లి జనసభలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నేడు మద్యాహ్నం 12.30 గంటలకు తాజ్ కృష్ణ లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి హెలికాప్టర్ లో మక్తల్ చేరుకొని, మధ్యాహ్నం 3 గంటలకు మక్తల్ లో ప్రచార సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.30 గంటలకు ముషీరాబాద్ లో ప్రచార సభ ఉండనుంది. 8.30 గంటలకు బెంగుళూరు బయలుదేరుతారు.
ఈ రోజు తెలంగాణలో ఛత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ పర్యటించనున్నారు. మద్యాహ్నం 1 గంటకు వెస్ట్ వరంగల్ కాజీపేట చౌరస్తా లో, మద్యాహ్నం 3.30 గంటలకు సర్కస్ గ్రౌండ్ కరీంనగర్ లో జరిగే ప్రచార సభలో ఆయన పాల్గొంటారు.
ఈ రోజు (నవంబర్ 26) ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సభలు మూడు చోట్ల ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ఆందోల్ లో ఎన్నికల ప్రచారం ఉంది. మధ్యాహ్నం 2.30 గంటలకు సంగారెడ్డిలో, సాయంత్రం 4.15 గంటలకు కామారెడ్డి లో రాహుల్ పర్యటిస్తారు.
Background
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఏ చిన్న పొరపాటు చేసిన ప్రత్యర్థి పార్టీలు ఈసీకి ఫిర్యాదులు చేస్తుంటాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ (Election code violation) కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సూర్జేవాల ఫిర్యాదు ఆధారంగా కేటీఆర్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. టీ వర్క్స్‌లో జరిగిన స్టూడెంట్ ట్రైబ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు ఇచ్చిన నోటీసులో ఎలక్షన్ కమిషన్ కోరింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు అశోక్ నగర్ వెళ్లి వర్సిటీ విద్యార్థులతో పాటు నిరుద్యోగులతో సమావేశం అవుతానని మంత్రి కేటీఆర్ ఇటీవల యువతకు భరోసా ఇవ్వడం తెలిసిందే. అయితే ‘టీ’ వర్క్స్ భేటీలో.. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతకు కేటీఆర్ హామీ ఇచ్చారు. కొన్ని తప్పులు జరిగినట్లు ప్రభుత్వమే గుర్తించిందని, బయటివాళ్లు చెప్పకముందే తామే చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేపర్ల లీక్ కారణంగా టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాజకీయ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం టీ వర్క్స్ ను వినియోగించారని కాంగ్రెస్ నేత సుర్జేవాల మంత్రి కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. అన్ని విషయాలు పరిశీలించిన ఈసీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ప్రాథమిక ఎన్నికల నియామవాళిని కేటీఆర్ ఉల్లంఘించారని ఈసీ భావిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా తమకు వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.
రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మంత్రి కేటీఆర్ (KTR) ప్రశ్నలు సంధించారు. యువతను మభ్యపెట్టి నాలుగు ఓట్లు వేయించుకునే నాటకం తప్ప చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా..? దమ్ముంటే తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో గత పదేండ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందా..? తొమ్మిదిన్నర ఏండ్లలో 2లక్షల 2వేల 735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి.. ఒక లక్షా 60వేల083 నియామకాలను పూర్తిచేసింది మా ప్రభుత్వం.. ఈ లెక్కతప్పని నిరూపించగలవా..? అని రాహుల్ గాంధీకి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు.
‘మీరు అధికారం వెలగబెట్టిన పదేండ్ల కాలంలో( 2004-14 ) తెలంగాణలో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? కేవలం 10వేల 116 మాత్రమే కాదా? ఇదేనా నిరుద్యోగులైన మీ ప్రేమ..?. మా ప్రభుత్వం ఏడాదికి సగటున నింపిన సర్కారు కొలువులు 16,850!. కాంగ్రెస్ హయాంలో( 2004-14 ) సంవత్సరానికి ఇచ్చింది కేవలం 1012 జాబులు..! ఇదీ మీకూ మాకూ వున్న తేడా..! మీరొచ్చి మాకు సుద్దులు చెబితే ఎట్లా..? జీవితంలో ఎప్పుడైనా ఉద్యమం చేసావా..? ఉద్యోగం చేసావా..? యువత ఆశలు ఆకాంక్షలు తెలుసా..? పోటీ పరీక్షలు రాసినవా.? ఇంటర్వ్యూ కు వెళ్లినవా..? ఉద్యోగార్థుల ఇబ్బందులు ఏమన్నా అర్థమైతయా నీకు..? అని ప్రశ్నించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -