తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 2009 డిసెంబరు 3లో శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, ఇన్నేళ్ల తర్వాత ఇదే రోజు 4 కోట్ల మంది ప్రజలు ఆయనకు ఘనమైన నివాళి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీకాంతాచారికి నివాళి అర్పిస్తున్నామని అన్నారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


ప్రగతి భవన్ ఇక ప్రజా భవన్
ప్రజల ఆదేశాన్ని ఒక సందేశంగా తీసుకొని వారు ఇచ్చిన తీర్పును శిరసావహించి, ప్రజల కలలను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో కొత్త సాంప్రదాయానికి, ప్రజాస్వామ్య విలువలు పునరుద్ధరించడానికి బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుందని ఆశిస్తున్నట్లుగా చెప్పారు. అన్ని చర్యలను కలిసి భాగస్వాములమై దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని పిలుపు ఇచ్చారు. సచివాలయంలోకి సామాన్యులకు కూడా తలుపులు తెరుచుకుంటాయని అన్నారు. ప్రజల ఆస్తి అయిన ప్రగతి భవన్ అనేది ప్రజా భవన్ అన్నారు. ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రజా భవన్’ అని పేరు పెడతామని, అందులోకి సామాన్యులకు కూడా ఎంట్రీ లభిస్తుందని అన్నారు. 


ప్రజల ఆకాంక్షలు, ఆలోచనల్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, దీంతో తమ బాధ్యత పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ విజయం సాధించిపెట్టారని కొనియాడారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తమలో స్ఫూర్తి నింపారని అన్నారు. తెలంగాణతో రాహుల్ గాంధీకి కుటుంబ బంధం ఉందని చెప్పారు. 


కేటీఆర్ అభినందనలు స్వాగతిస్తున్నాం - రేవంత్
తనను వెన్నుతట్టి ప్రోత్సహించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు మల్లు భట్టి విక్రమార్క ఎంతో సహకరించారని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అభినందనలు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలపడాన్ని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. ఈ ఎన్నికల్లో తమకు సహకరించిన వామపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. తమకు విలువైన సలహాలు ఇస్తూ, సంపూర్ణంగా సహకరించిన ప్రొఫెసర్ కోదండరాంకు ధన్యవాదాలు తెలిపారు.