తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం వేడి పెరిగింది. బీఆర్‌ఎస్ అసంతృప్తుల చేరిక... షర్మిల పార్టీ వీలనంతో హడావుడి మొదలైంది. తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత బెంగళూరు వెళ్లారు. నిన్న రాత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తనను కలిశాడని... తెలంగాణ రాజకీయ పరిణామాలపై చర్చించామని డీకే శివకుమార్ ట్వీట్ కూడా చేశారు. అయితే, వీరిద్దరి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందనేది హాట్ టాపిక్‌గా మారింది.
రెండు రోజుల కింద వైఎస్ షర్మిల ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్టీపీ విలీనంపై చర్చించారు. దాదాపు అన్నీ ఓకే అయినా.. ఆమె పోటీ చేసే స్థానంపైనే క్లారిటీ రాలేదు. షర్మిల పాలేరు టికెట్ కోసం పట్టుబడుతున్నారు. కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై గతంలో చాలాసార్లు ఆమె డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి, డీకే శివకుమార్ భేటీలోనూ... కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం, దానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించినట్టు సమాచారం. తుమ్మల నాగేశ్వర్రావు చేరికపై కూడా డీకేతో రేవంత్‌రెడ్డి చర్చించారని వార్తలు వస్తున్నాయి. రేవంత్... సునీల్ కనుగోలుతోనూ సమావేశమైనట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్‌లో మొత్తంగా పాలేరు టికెట్‌పైనే పంచాయతీ నడుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాలేరులో పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు... కాంగ్రెస్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరబోతున్న తుమ్మన నాగేశ్వరరావు కూడా పాలేరుపైనే పట్టుబిగిస్తున్నారు. ఇక, కాంగ్రెస్‌లో తన పార్టీ వీలనం చేయబోతున్న వైఎస్ షర్మిల కూడా పాలేరులో పోటీకే మొగ్గు చూపుతున్నారు. ఈ ముగ్గురిలో పాలేరు టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది. దీనిపైనే రేవంత్‌రెడ్డి.. డీకే శివకుమార్‌తో భేటీ అయినట్టు తెలుస్తోంది. అయితే, పాలేరు టికెట్ ఎవరికి ఇవ్వబోతున్నారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
బెంగళూరు పర్యటన ముగించుకుని రేవంత్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్ వస్తారని గాంధీభవన్‌వర్గాలు చెప్తున్నాయి. రేవంత్‌రెడ్డి హైదరాబాద్ వచ్చాక.. డీకేతో ఏ విషయాలపై చర్చించారో తెలిసే అవకాశం ఉందంటున్నారు. పాలేరుపై క్లారిటీ వస్తే తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని.. పాలేరులో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెప్తున్నారు. డీకే శివకుమార్‌తో భేటీ అయిన రేవంత్‌రెడ్డి... తుమ్మలకు పాలేరు సీటుపై ఎలాంటి హామీ ఇచ్చారు. అనుచరులతో సమావేశమవుతున్న తుమ్మల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.