ఎన్నికల సందర్భంగా ప్రతి విషయంపై చాలా జాగ్రత్తంగా ఉండాలని పార్టీ నేతలకు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం బీఆర్‌ఎస్‌దేనని మరోసారి స్పష్టం చేశారు. అందుకే ఎవరూ తొందర పడొద్దని సూచించారు. 


అభ్యర్థుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు కేసీఆర్. సాంకేతికంగా దెబ్బతీయాలని చాలా మంది చూస్తున్నారని అలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలే తప్ప ప్రతిదీ తమకు తెలుసు అనే నిర్లక్ష్యం వద్దని అన్నారు. ఇలాంటి వాటిపై గైడ్ చేయడానికి పార్టీ జనరల్ సెక్రటరీ భరత్‌ కుమార్‌ అందుబాటులో ఉంటారని అభ్యర్థులకు నెంబర్ ఇచ్చారు. 
ఎన్నికల రూల్స్ చాలా మారాయని హెచ్చరించారు. బీ ఫామ్ నింపేటప్పుడు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా చూడాలన్నారు. ఎలాంటి అజాగ్రత్త లేకుండా నిన్నటి వరకు అప్‌డేట్‌ ఉన్న అన్ని విషయాలను పొందుపరచాలన్నారు. 


ప్రస్తుతం 51 మంది అభ్యర్థుల బీఫామ్‌లు రెడీ అయ్యాయని తెలిపారు. త్వరలోనే అందరికీ బీఫామ్‌లు ఇస్తామని చెప్పారు. నాలుగైదు మినహా అందరికీ పాతవారికే టికెట్లు ఇచ్చామన్నారు. న్యాయపరమైన ఇబ్బందుల వల్లే వేములవాడ టికెట్ విషయం పక్కన బెట్టామన్నారు. 


ప్రతి అభ్యర్థి కోపతాపాలను పక్కన పెట్టి ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్లి పలకరించాలని కలిసి వచ్చేలా ప్రయత్నించాలన్నారు. గత ఎన్నికల్లో కూడా ఒకరిద్దరి అభ్యర్థులు ఈసూచనలు పక్కన పెట్టారు. అందుకే వాళ్లు ఓడిపోవాల్సి వచ్చింది. అందుకే చిన్న చిన్న మనస్పర్థలు పక్కన పెట్టి కలిపుకొని వెళ్లాలని చెప్పారు.