కొడంగల్‌ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు. మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు దక్కాయి. సిట్టింగ్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ హుజూర్‌ నగర్‌ నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన సతీమణి పద్మావతి రెడ్డికి కోదాడ టికెట్‌ కేటాయించారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేరు కూడా జాబితాలో లేదు. వీరందరి పేర్లు బుదవారం లేదా గురువారం గురువారం విడుదల చేసే రెండో జాబితాలో ప్రకటించే ఛాన్స్ ఉంది. 


17 నియోజకవర్గాల్లో రెడ్లకు సీట్లు


55 మందితో కూడిన జాబితా విడుదల చేయడంతో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు కేటాయించారన్న దానిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 55 సీట్లలో అత్యధికంగా రెడ్డి సామాజికవర్గానికి 17 నియోజకవర్గాల్లో సీట్లు కేటాయించింది. 12 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో మాదిగ సామాజికవర్గానికి 8, మాల సామాజికవర్గానికి 4 టికెట్లు కేటాయించారు. రెండు ST రిజర్వ్‌ స్థానాలకు అభ్యర్థులకు ప్రకటించింది హస్తం పార్టీ. రెండూ కూడా ఆదివాసీ సామాజిక వర్గానికే ఇచ్చింది. ములుగు నుంచి ధనసరి అనసూయ ఆలియాస్ సీతక్క,  భద్రాచలం టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు కేటాయించింది. 


బీసీలకు 12 సీట్లు


బ్రాహ్మణులకు 2 టికెట్లు ఇచ్చింది. మంథని నుంచి శ్రీధర్ బాబు, సనత్ నగర్ నుంచి కోట నీలిమ బరిలోకి దిగుతున్నారు. వెలమలకు - 7 సీట్లు కేటాయించింది. బీసీలు 34 నియోజకవర్గాల్లో సీట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తొలి జాబితాలో 12 సీట్లు కేటాయించింది. యాదవ్‌లకు 4, మున్నూరు కాపు, పద్మశాలీ సామాజిక వర్గాలకు చెరో 2 సీట్లు, ముదిరాజ్‌, బొంది,బోయ, చాకలి వర్గాలకు ఒక్కో టికెట్‌ ఇచ్చారు. మైనార్టీలకు 3 టికెట్లు కేటాయించింది కాంగ్రెస్‌. హైదరాబాద్‌లోని మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్‌ టికెట్లను మైనార్టీలకు ఇచ్చింది. 


ఆర్మూర్, బోథన్‌, బాల్కొండ, జగిత్యాల, సంగారెడ్డి, గజ్వేల్‌, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, పరిగి, కొడంగల్, నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి, నాగార్జునసాగర్‌, హుజూర్‌నగర్‌, కోదాడ, నర్సంపేట నియోజకవర్గాల్లో రెడ్డి సామాజికవర్గానికి టికెట్లు ఇచ్చారు. మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి, మెదక్‌, మల్కాజ్‌గిరి, కొల్లాపూర్, భూపాలపల్లిలో వెలమ నేతలకు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. మంథని, సనత్‌నగర్‌ నియోజకవర్గాలను.. బ్రాహ్మణ సామాజికవర్గానికి ఇచ్చింది. బీసీలకు ఇచ్చిన టికెట్లను పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌ విస్మరించిన కొన్ని కులాలకు కూడా తొలి జాబితాలోనే స్థానం కల్పించింది కాంగ్రెస్‌. గోషామహల్‌ నుంచి ముదిరాజ్‌ వర్గానికి చెందిన మొగిలి సునీతకు టికెట్‌ ఇచ్చారు. మేడ్చల్‌, ముషీరాబాద్‌, గద్వాల, ఆలేరు నియోజకవర్గాల్లో యాదవ సామాజిక వర్గం నేతలను బరిలోకి దించింది.


మున్నూరు కాపులకు రెండు సీట్లు


యాకుత్‌పురా, బహదూర్‌పురా నియోజవర్గాలు పద్మశాలీలకు, సికింద్రాబాద్‌, వేములవాడ నియోజకవర్గాల సీట్లను మున్నూరుకాపులకు షాద్‌నగర్‌ టికెట్‌ చాకలి సామాజికవర్గానికి ఇచ్చింది. చాంద్రాయణగుట్ట టికెట్‌ బోయ కమ్యూనిటీకి, రామగుండం నుంచి బొంది సామాజికవర్గం నేత మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు టికెట్‌ ఇచ్చింది హస్తం పార్టీ. కమ్మ సామాజిక వర్గానికి తొలి జబితాలో చోటు కల్పించలేదు