Telangana Assembly Elections 2023: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత...తెలంగాణలో బీజేపీ శ్రేణులు వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మాత్రం...సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్లలేకపోతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ దూకుడు మీదుంటే... బీజేపీ మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీ నాయకత్వం చేరికల కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాయకత్వంలో ప్రత్యేకంగా కమిటీ వేసినా...ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. మొదట్లో రెండు సమావేశాలు నిర్వహించిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...ఆ తర్వాత అతిగతీ లేకుండా పోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఈటల రాజేందర్...అది దక్కకపోవడంతో నిరాశలో మునిగిపోయారని టాక్ బలంగా వినిపిస్తోంది. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక ఈటల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి వాళ్లంతా పార్టీకి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలే చెవుళ్లు కొరుకుంటున్నారు.
బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత...బీజేపీలో మునుపటి దూకుడు లేదని సొంత పార్టీ చెబుతున్నారు. కొందరు బండిని తప్పించడాన్ని నిరసిస్తూ పార్టీకి రాంరాం చెప్పేశారు. కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత...బీజేపీ వెనుకబడిపోయిందని నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీని ఆడుకోవాల్సిన నేతలే...సైలెంట్ అయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయ్. వీలయినంత తర్వాత అభ్యర్థులను ప్రకటించాల్సిన కాషాయ పార్టీ నేతలు...సభలు, సమావేశాలతోనే పబ్బం గడుపుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో కూడా సీట్లు రావని కింది స్థాయి కేడర్ మండిపడుతోంది. అధికారంలోకి వస్తామని చెప్పిన నేతలే...ఇపుడు సైలెంట్ అవడంతో కేడర్ లోలోపల రగిలిపోతోంది. ఏం చేస్తారని భావిస్తే...ఇంకేదే జరుగుతోందని పళ్లు కొరుకుతున్నారట.
మాజీ మంత్రి కృష్ణయాదవ్...కాషాయ జెండా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో ఆయన బీజేపీలో చేరనున్నారు. అనుచరులతో సమావేశం నిర్వహించిన తర్వాత...బీజేపీలో చేరాలన్ననిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. గతంలో ప్రజల మధ్య ఉన్నానని... రాబోయే రోజుల్లోనూ ప్రజల మధ్యే ఉంటానన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మచ్చ లేకుండా పరిపాలిస్తుందన్న క్రిష్ణయాదవ్... రాబోయే ఎన్నికల్లో అధిష్ఠానం నిర్ణయమే శిరసా వహిస్తానని వెల్లడించారు. బుధవారమే బీజేపీలో చేరేందుకు సిద్ధమైనా...పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది. అంబర్ పేట అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని క్రిష్ణ యాదవ్ భావిస్తున్నారు. అదే స్థానం నుంచి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భార్య కావ్యను బరిలోకి దించాలని ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారట.
వేములవాడ అసెంబ్లీ టికెట్కు తీవ్ర పోటీ నెలకొంది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు బీజేపీలో చేరారు. మొన్నటి వరకు ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ వ్యవహారాలు చూసుకున్న ఆయన...ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వికాస్ రావు వేములవాడ టికెట్ కోరుతున్నారు. ఇదే నియోజకవర్గంపై మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరితోపాటు బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో పాటు మరికొందరు నేతలు...టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టికెట్ విషయంలో ప్రస్తుతం తుల ఉమ, వికాస్ రావు మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరివైపు హైకమాండ్ మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా మంది ఆశిస్తున్న అయితే ఇలాా నియోజకవర్గాల్లో పోటీ అయితే ఉంది కానీ గెలిచే సత్తా ఉన్న నాయకుల కోసం బీజేపీ వేచి చూస్తోంది. అదే మిగతవారిని సందిగ్దంలో పడేస్తోంది.