Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు సీట్లు తెచ్చుకున్నారు. నామినేషన్లు వేశారు. అయితే ఇక్కడే ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. టిక్కెట్‌  దక్కని నేతలు, పార్టీలో కొన్నాళ్లుగా ప్రాధాన్యం, పదవులు లభించని వారు  అభ్యర్థులకు సహకరించడం లేదు. కొంతమంది వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉంటే మరికొందరు ప్రచారంలో పాల్గొనకుండా ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ అసమ్మతి నేతలను దారికి తెచ్చుకోవడం మీదే ప్రధాన పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. బుజ్జగింపులతో కొందరు నేతలు అలక వీడడంతో సంబంధిత అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రెండు నెలల క్రితమే అధికార బీఆర్ఎస్‌ (BRS) అభ్యర్థులను ప్రకటించినా కిందిస్థాయి నేతలు అసంతృప్తిగా ఉండటంతో...అభ్యర్థులు ఈ నేతలపై దృష్టి సారించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అనేక ప్రాంతాల్లో బల్దియా కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు మధ్య అంతర్గతంగా గొడవలు ఉన్నాయి. వీటిని పరిష్కరించకపోతే అధికార పార్టీకి కష్టాలేనని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో సంబంధిత కార్పొరేటర్లతో స్థానిక నాయకులతోనూ అభ్యర్థులు మాట్లాడుతున్నారు. 


సస్పెన్షన్లు, తొలగింపులు వంటి చర్యల్లేవ్
టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు ఊరేగింపులతో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు టికెట్లు రాని ఆశావహుల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో వారి పాత్ర కీలకం కావడంతో ఆయా నేతలను వదులుకోరాదని, విజయానికి వారి సాయం తీసుకోవాలని పార్టీల అధిష్ఠానాలు భావిస్తున్నాయి. వారికి నచ్చజెప్పి అభ్యర్థులతో కలిసి పనిచేయించేలా ఒప్పిస్తున్నాయి. సస్పెన్షన్లు, తొలగింపుల వంటి కఠిన చర్యలు తీసుకోకుండా హితబోధతో శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అనివార్య పరిస్థితుల కారణంగానే టికెట్‌ ఇవ్వలేకపోయామని, పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. మన పార్టీనే అధికారంలోకి వస్తుందని, మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుందని అగ్రనేతలు భరోసా ఇస్తున్నారు. ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని, వాటి ద్వారా ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీల పదవులను పొందొచ్చని అసంతృప్తులకు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ తగిన అవకాశమిస్తామని అసంతృప్తులకు పదవులతో గాలం వేస్తున్నాయి.


పదవులతో అసమ్మతి నేతలకు ఎర
గులాబీ పార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తారనే ప్రచారం ముందు నుంచీ జరిగినా కొందరినైనా మారుస్తారని ఆ పార్టీ నేతలు ఆశించారు. అలాంటి వారి కోరిక నెరవేరలేదు. దీంతో పలుచోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. వారంతా సీనియర్లు, ముఖ్యనేతలు కావడంతో అధిష్ఠానం వారిని దూరం చేసుకోవద్దనే నిర్ణయానికి వచ్చింది. అసంతృప్త నేతలకు నామినేటెడ్ పదవులను బుజ్జగింపులతో దారిలోకి తెచ్చుకుంటోంది. షెడ్యూల్‌ రాక ముందే కొందరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులిచ్చింది. ఆ తర్వాత మరికొందరికి హామీలు ఇస్తోంది. కాంగ్రెస్‌లోనూ అసమ్మతి బెడద తీవ్రస్థాయికి చేరింది. టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. టికెట్‌ దక్కని నేతలు కొందరు పార్టీని వీడారు. తీవ్ర అసమ్మతి వ్యక్తమవడంతో అధిష్ఠానం వారితో మాట్లాడింది. పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, దాదాపు వేయికిపైగా పదవులుంటాయని సర్దిచెబుతోంది. అధికారం వచ్చాక టికెట్‌ రాని నేతలకే ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇస్తోంది. కమలం పార్టీ సైతం అసంతృప్తులను దారిలోకి తచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టికెట్‌ రాని వారికి కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పదవులిస్తామంటోంది. కేంద్ర ప్రభుత్వంలో పెద్ద సంఖ్యలో పదవులున్నట్లు గుర్తుచేస్తోంది.