మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటరెడ్డి రాజగోపాల్‌రెడ్డి... కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇవాళ (శుక్రవారం) రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతానని ప్రకటించిన  ఆయన... ఒక రోజు ముందే పార్టీలో చేరిపోయారు. నిన్న (గురువారం) రాత్రి... ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో  తెలంగాణ కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్‌రెడ్డి కూడా ఉన్నారు. హడావుడిగా పార్టీ చేరేందుకు కూడా కారణం ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ  సమావేశం ప్రారంభానికి ముందే పార్టీ సభ్యత్వం ఉండాలన్న సాంకేతిక కారణంతో.. ఆయన నిన్న రాత్రే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఇవాళ (శుక్రవారం) ఏఐసీసీ  అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షేంలో అధికారికంగా పార్టీ చేరే అవకాశం ఉంది.


కాంగ్రెస్‌లోకి మళ్లీ అడుగుపెట్టిన రాజగోపాల్‌రెడ్డి... కాంట్రావర్సీ కామెంట్స్‌ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. పార్టీలో వర్గవిభేదాలకు  తావిచ్చేలా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే సీఎం ఎవరవుతారన్న ప్రశ్నకు ఆయన తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి  ఎవరైనా కావచ్చని అన్నారు. రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తారన్న అన్న ప్రశ్నకు కూడా ఆయన.. ధీటుగా జబాబిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీలో పదవులు మారుతూ ఉంటాయని..  ఎవరి పదవి శాశ్వతం కాదని అన్నారు. రేవంత్‌రెడ్డికి కూడా టీపీసీసీ పదవి శాశ్వతం కాదని.. రెండు నెలల తర్వాత ఆ పదవిలో ఎవరుంటారో చెప్పలేమన్నారు.


బీఆర్‌ఎస్‌ను ఓడించడమే తన లక్ష్యమని.. అందుకే కాంగ్రెస్‌లో చేరానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని... దీనిపై కేంద్రంలో  అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావించి.. ఆ పార్టీలోకి వెళ్లినట్టు చెప్పారాయన. కానీ... బీజేపీలో పరిస్థితి మరోలా ఉందని.. కేసీఆర్‌ అవినీతిపై  చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు. ఈ విషయం తనను బాధించిందన్న రాజగోపాల్‌రెడ్డి... బీఆర్‌ఎస్‌ను గద్దెదించాలంటే.. కాంగ్రెస్‌తోనే సాధ్యామని నమ్ముతున్నానన్నారు.  తెలంగాణ కాంగ్రెస్‌ వేవ్‌ ఉందని చెప్పారాయన. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 నుంచి 90 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను గద్దె దింపడం కోసమే మళ్లీ కాంగ్రెస్‌లో  చేరానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా, ఓడించే శక్తి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్ష మేరకే తాను కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. నిన్న (గురువారం) రాత్రి... ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.


మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకరెడ్డి చేతిలో ఓడిపోయారు రాజగోపాల్‌రెడ్డి. అప్పటి నుంచి బీజేపీలో ఆయన యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు..  ఎన్నికలకు నెల రోజుల ముందు మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరారు. పార్టీ ఆదేశిస్తే... గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడించాలని ఉందని కూడా రాజగోపాల్‌రెడ్డి సవాల్‌ చేశారు. మునుగోడలో మొత్తం యంత్రంగాన్ని దింపి... తనకు కేసీఆర్‌ ఓడించారని.. అందుకు బదులు తీర్చుకోవాలని అంటున్నారాయన. అందుకే... రెండు చోట్ల పోటీకి సిద్ధమన్నారు. అధిష్టానం ముందు ప్రతిపాదన కూడా పెట్టారు. మరి... కాంగ్రెస్‌ రెండో జాబితా ఖరారు రానున్న వేళ... రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు, గజ్వేల్‌ రెండు చోట్ల పోటీచేసే అవకాశాన్ని అధిష్టానం కల్పిస్తుందో లేదో చూడాలి.