Andhra Pradesh Assembly Elections : టిడిపి-జనసేన ప్రకటించిన తొలిజాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి (West Godavari)జిల్లాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జిల్లాలో ఒక్క సీటును కూడా జనసేన (Janasena)నుంచి ప్రకటించకపోవడంతో ఇరుపార్టీల అభ్యర్ధుల్లో అయోమయం నెలకొంది. జిల్లాలో మిగిలిన తొమ్మిది స్థానాలను జనసేనకు ప్రకటించే సీట్లు ఎన్ని? టిడిపికి కేటాయించేవి ? ఎన్ని అనే చర్చ వాడివేడిగా సాగుతోంది. ఉమ్మడి జాబితాలో టిడిపి నుంచి ఏలూరు, ఉండి, ఆచంట, తణుకు,చింతలపూడి, పాలకొల్లు నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేసారు. 


కాపులకు రెండు, కమ్మ, బిసి, యస్సి, క్షత్రియలకు ఒక్కొక్కటి
ఉండి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతకాగా పాలకొల్లు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ట కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా, తణుకు నుంచి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ట కమ్మ సామాజిక వర్గానికి చెందినవారుకాగా, చింతలపూడి నుంచి సొంగా రోషన్ కుమార్ యస్సి,  ఆచంట నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బిసి సామాజిక వర్గానికి చెందిన నేతలుగా ఉన్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన  ఆరు స్థానాల్లో కమ్మ-1, కాపు-2, బిసి-1, యస్సి-1, క్షత్రియ-1 చొప్పున ఉన్నారు.


ఏలూరు టికెట్ బడేటి సోదరుడికి
ఏలూరు అసెంబ్లీ టికెట్ ను తెలుగుదేశం పార్టీ బడేటి బుజ్జి సోదరుడి రాధాకృష్టకు కేటాయించింది. నియోజకవర్గాల్లో ప్రకటించిన టిడిపి అభ్యర్ధుల బలాబలాలు ఒక్కసారి చూస్తే  2014నుంచి 19వరకు ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన బడేటి బుజ్జి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన సోదరుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన బడేటి రాధాకృష్ట అలియాస్ బడేటి చంటి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున ఏలూరు అసెంబ్లీ నుంచి బరిలో దిగబోతున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న బడేటి చంటి...తన అన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో క్షేత్రస్థాయి రాజకీయాలను చక్కబెట్టారు. మాజీ ఎమ్మెల్యే బుజ్జి మృతి తర్వాత చంటికి టిడిపి అవకాశం కల్పించింది. వ్యాపారవేత్తగా ఉంటూ రాజకీయాల్లో ఉంటున్న చంటి...గడిచిన మూడేళ్ళుగా ఏలూరు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జనసేన సీటు ఆశించినప్పటికి టిడిపి అభ్యర్ది బడేటి చంటికే అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో బడేటి చంటి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో దిగబోతున్నారు.


వైసీపీ నుంచి మాజీ మంత్రి ఆళ్ల నాని
వైసీపీ నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని బరిలోకి దిగుతున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి-జనసేన విడివిడిగా పోటిచేయడంలో స్పల్ప మెజార్టీతో ఆళ్ళ నాని ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి టిడిపి-జనసేన కలసి పోటిచేస్తుండటంతో వైసిపి విజయం కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గడిచిన ఆరు ఎన్నికల్లో పోటి చేసిన ఆళ్ళనాని మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మంత్రిగా పని చేసిన సమయంలో పార్టీ కార్యక్రమాల విషయంలో ఆశించిన స్థాయిలో ఆయన పని చేయలేపోయారనే విమర్శలు ఉన్నాయి. కీలకమైన క్యాడర్ ఆయనకు దూరంగా ఉంటోంది. దీంతో టిడిపి అభ్యర్ధిని ఓడించడం ఆళ్ల నానికి కష్టమైన పనేనని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.