Chandrababu Alliance With BJP: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధపడిన బీజేపీ.. ఒక్కసారిగా టీడీపీ, జనసేన కూటమిలో చేరేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఢిల్లీకి బీజేపీ అధినాయకత్వం పిలిపించింది. బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలు తరువాత అమిత్‌ షాతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుమారు గంటపాటు చర్చించారు. వీరితోపాటు ర్చల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ముగ్గురు నేతలు ఏం చర్చించుకున్నారన్న దానిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. కానీ, రాష్ట్రంలో బీజేపీ పోటీ చేయాలనుకుంటున్న సీట్లు, పొత్తులో భాగంగా సీట్ల పంపకాలపై చర్చలు జరిపినట్టు చెబుతున్నారు. 


సీట్ల లెక్క తేలినట్టేనా..?


అమిత్‌ షా, జేపీ నడ్డాతో బుధవారం రాత్రి నుంచి అర్ధరాత్రి దాటేంత వరకు చర్చలు జరిపిన చంద్రబాబు.. బయటకు వచ్చిన తరువాత కూడా వివరాలను వెల్లడించలేదు. గురువారం పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవబోతున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చలు విషయాలను పవన్‌ కల్యాణ్‌కు వివరించనున్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. బీజేపీ కోరుకున్న సీట్లను టీడీపీ, జనసేన ఇస్తాయా..? లేదా..? అన్న దానిపై ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది.


ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్టు 20 ఎమ్మెల్యే, ఆరు నుంచి ఎనిమిది ఎంపీ స్థానాలను బీజేపీ అగ్ర నాయకులు చంద్రబాబును అడిగారా..? ఇంకేమైనా ప్రతిపాదనలు పెట్టారా..? అన్నది తేలాల్సి ఉంది. విశాఖ, అరకు, ఏలూరు, రాజమండ్రి, విజయవాడతోపాటు రాయలసీమలో ఓ ఎంపీ స్థానాన్ని బీజేపీ అడుగుతోందని టాక్ నడుస్తోంది. ఇక్కడ ఎవరెవరు పోటీ చేయాలో కూడా ఆ పార్టీ లిస్ట్‌ టీడీపీ ముందు పెట్టి మాట్లాడుతోందని అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఏం చెప్పారనేది మాత్రం టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన లేదు. 


దేశంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలను పెంచుకునే ఉద్ధేశంలో బీజేపీ అగ్రనాయకత్వం.. ఆ దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఏపీలో పొత్తుకు సిద్ధపడినట్టు చెబుతున్నారు. బీజేపీ అడిగిన సీట్లపై చంద్రబాబు ముఖ్య నాయకులతో చర్చించి తెలియజేస్తామని చంద్రబాబు చెప్పి వచ్చినట్టు చెబుతున్నారు. దీనిపై టీడీపీ ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా వీరి మధ్య జరిగింది. దేశంలో 400 సీట్లను గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమిత్‌ షా ఈ సందర్భంగా చంద్రబాబుకు చెప్పినట్టు చెబుతున్నారు. 


పొత్తులపై ఫైనల్‌ నిర్ణయం


రాష్ట్రంలో పొత్తులు, ఆయా పార్టీలు పోటీ చేయబోయే స్థానాలపై గురువారం ఫైనల్‌ నిర్ణయం వెలువడే అవకాశముంది. బీజేపీ పెద్దలు నుంచి పిలుపు రావడంతో పవన్‌ కల్యాణ్‌ కూడా ఢిల్లీకి వెళుతున్నారు. ముందుగా పవన్‌ కల్యాణ్‌ బీజేపీ ముఖ్య నాయకులతో ఒంటరిగా సమావేశం కానున్నారు. అనంతరం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి మరోసారి బీజేపీ అగ్ర నాయకులతో కలిసి చర్చిస్తారు. ఈ సందర్భంగా సీట్ల పంపకాలపై స్పష్టత రానుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలతో బుధవారం రాత్రి గురువారం తెల్లవారుజాము వరకు చర్చలు జరిపారు. పొత్తు అవసరం, ఇతర అంశాలను నేతలకు చంద్రబాబు వివరించారు.