Chandrababu Slams Cm Jagan In Dharmavaram Meeting: తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే రూ.4 వేల పింఛన్ అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో (Dharmavaram) కూటమి అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో (Amit Shah) కలిసి ఆయన ఆదివారం పాల్గొన్నారు. అలాగే, దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఇస్తామని చెప్పారు. సీఎం జగన్ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని.. నిరుద్యోగ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే దుస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని అన్నారు. సమర్థ నాయకత్వం ఉండి కేంద్రం సహకారం తీసుకుంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు.


'ధర్మాన్ని గెలిపించండి'


రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అంతా సిద్ధం కావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. 'దేశంలో రాబోయేది ఎన్డీయేనే.. మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి. జగన్ 3 రాజధానుల పేరుతో అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారు. అమరావతిని నాశనం చేసిన ఆయన్ను ఇంటికి పంపాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని దేశంలోనే నెంబర్ వన్ రాజధానిగా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీయేది. కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. మన ఆశలను సైకో జగన్ నాశనం చేశారు. రాజధాని ఏదో చెప్పలేని స్థితికి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. పోలవరం పూర్తి చేసి హంద్రీనీవాతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రతి ఎకరాకు నీరందిస్తాం. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి. ఐదేళ్ల పాలనా కాలంకో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.' అంటూ చంద్రబాబు మండిపడ్డారు.


అమిత్ షా కీలక ప్రకటన






అటు, ఇదే సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు. 'ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అవినీతితో వాటిని దుర్వినియోగం చేశారు. దీంతో పోలవరం బాగా ఆలస్యమైంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో చంద్రబాబును గెలిపించాలి. కేంద్రంలో నరేంద్ర మోదీని కొనసాగించాలి. రాబోయే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఏపీ అభివృద్ధిని చంద్రబాబు, ప్రధాని మోదీ చూసుకుంటారు. రాష్ట్రంలో గూండా గిరి, అవినీతి, అరాచకాలను అరికట్టేందుకు కూటమిలో కలిశాం. భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాను నివారించడానికి పొత్తు పెట్టుకున్నాం. అమరావతిని తిరిగి రాజధాని చేసేందుకే టీడీపీ, జనసేనతో కలిశాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు గెలిపించాలి.' అని అమిత్ షా పిలుపునిచ్చారు.


Also Read: Dharmavaram: జూ.ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు - అమిత్ షా, చంద్రబాబు సభలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు