AP Elections 2024: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో జై ఎన్టీఆర్ అన్న నినాదాలు మారుమోగాయి. ఎన్నికల వేళ అమిత్ షా, చంద్రబాబు పాల్గొన్న ప్రచార కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ప్రదర్శన, ఎన్టీఆర్ సీఎం అంటూ పలువురు చేసిన నినాదాలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రదర్శన చేశారు. ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ఎన్నికల ప్రచారం కోసం ఆదివారం (మే 5) అమిత్ షా వచ్చారు. ధర్మవరంలోని సీఎన్బీ గార్డెన్స్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు అమిత్ షా తో పాటు చంద్రబాబు కూడా హాజరయ్యారు. 


అయితే టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల కంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా ఎక్కువగా కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా ఉన్న ఫోటోలతో జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ సీఎం అంటూ ప్రదర్శన నిర్వహించారు. వారు ప్రదర్శించిన ప్లకార్డుల్లో ఎక్కడా చంద్రబాబు, లోకేష్, బాలక్రిష్ణ ఫోటోలు లేవు. కేవలం సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వారు సభలో జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.