Elections 2024 :   అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ సమరంలో  ఇంత కాలం గుట్టుగా ఉన్న అనేక విషయాలను ఎవరికి వారే బయట పెట్టుకుంటున్నారు. సీఎం జగన్ మీడియా ఇంటర్యూల్లో కొన్ని విషయాలు చెబుతూండగా.. షర్మిల కూడా రివర్స్ లో ఇంత కాలం బయటకు తెలియని కొన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. శుక్రవారం షర్మిల నిర్వహించన ప్రెస్ మీట్ లో వైఎస్ విజయలక్ష్మి ప్రస్తావన తీసుకు వచ్చారు.  చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ మాట ఇచ్చారన్నారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తల్లికి ఇచ్చిన  మాటనే నిలబెట్టుకోలేని జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 


వైఎస్ విజయలక్ష్మి గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేశారు. ఇటీవలికాలం వరకూ ఆమె గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మే పోటీ చేశారు. అసెంబ్లీలో వైసీపీ తరపున పోరాడారు. వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్నారు. విజయలక్ష్మిని విశాఖ ఎంపీగా నిలబెట్టడంతో ఆమె పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నుంచి  మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.                           


అదే సమయంలో షర్మిల కోసం వైసీపీ కోసం పని చేశారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరించారు. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం కానీ.. మరో రకమైన పదవిని కానీ ఆశించలేదు. షర్మిలకు వైసీపీలో ఎప్పుడూ ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయితే షర్మిలను ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ హామీ ఇచ్చినట్లుగా తాజాగా షర్మిల చెప్పారు.  రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుల్లా గతంలో వైఎస్  షర్మిల   పేరు కూడా వినిపించేది. తర్వాత ఏమయిందో కానీ షర్మిలకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకోవడంతో తన అవసరం కుమార్తెకు ఎక్కువగా ఉందని .. అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్లీనరీలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేక అమెరికా వెళ్లిపోయారని చెబుతున్నారు. ఈ లోపు షర్మిల కు ఎంపీ పదవి ఇస్తామని తల్లికి చెప్పి మాట తప్పారన్న సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.                                      


మరో వైపు  జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితిపై తనకు ఆందోళన ఉందని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ఇదే విధంగా స్పందించారు. ఆయనకు అద్దం పంపించారు. జగన్ మానసిక స్థితిపై ఆందోళనగా ఉందన్నారు.