Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేసింది రాష్ట్ర ఎన్నిక సంఘం. కీలకమైన రిజర్వేషన్ అంశంపై కోర్టు స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇచ్చిన నోటిఫికేషన్ నిలిపేస్తున్నట్టు పేర్కొంది. దీంతో ఉదయం నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్‌ఈసీ సాయంత్రానికి వాటిని నిలిపేస్తూ ప్రకటన జారీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి నామినేషన్లు వేసేందుకు సిద్దమైన అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఎస్‌ఈసీ విడుదల చేసిన ప్రకటనలో ఇలా చెప్పుకొచ్చింది." భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-K, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లోని సెక్షన్లు 196, 197, 198 ల ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంక్రమించిన అధికారాల ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నాం. గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్, మండల ప్రజా పరిషత్ సభ్యులు, జిల్లా ప్రజా పరిషత్ సభ్యులు, ఎన్నికల నిర్వహణ నియమావళి 2018లోని (6) వ నియమం ప్రకారం జడ్‌పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలకు గత నెల 29న గెజిట్ నోటిఫికేషన్ నం. G-762/1 విడుదలైంది. తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు దీన్ని తక్షణం నిలుపుదల చేశాం.
రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు తక్షణమే ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో, మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో నమోదైన ఓటర్లకు తెలియజేస్తున్నాం. " అని వెల్లడించింది.