Scrutiny of nominations in AP is over : ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాకు 503 నామినేషన్లు ఆమోదించారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,705 నామినేషన్లు ఆమోదించారు. వివిధ పార్టీల నేతలు వేసిన డమ్మీ నామినేషన్లు, ఇండిపెండెంట్లుగా వేసిన పలువురు నిబంధనలను పాటించకపోవడంతో పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 183, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 939 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ వివరాలను సీఈవో కార్యాలయం ప్రకటించింది.
శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పీసీలకు సంబంధించి మొత్తము 686 నామినేషన్లు, 175 ఏసీలకు సంబంధించి మొత్తము 3,644 నామినేషన్లు దాఖలు అయ్యాయి. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంంధిచి గుంటూరు స్థానానికి అత్యధికంగా 47 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యల్పంగా 16 నామినేషన్లు శ్రీకాకుళం నియోజకవర్గానికి దాఖలయ్యాయి.. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబందించి తిరుపతి స్థానికి 52 నామినేషన్లు, అత్యల్పంగా 8 నామినేషన్లు చోడవరం స్థానానికి దాఖలయ్యాయి. నామినేషన్ల ఆమోదం విషయంలో అత్యధికంగా 48 నామినేషన్లు తిరుపతికి , అత్యల్పంగా 6 నామినేషన్లు చోడవరం నియోజకవర్గంలో ఆమోదించారు.
ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది, నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్థులు మినహా మిగిలిన వారు మే 13న జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులుగా పరిగణిస్తారు. గుర్తులు కూడా అప్పుడే ఖరారు చేస్తారు. ఎన్నికల్లో జాతీయ జనసేన పేరుతో పోటీ చేస్తున్న పార్టీ కూడా దాదాపుగా అన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఆ పార్టీకి బుకెట్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఉంది. ఆ గుర్తు .. బుకెట్ గుర్తు ఒకలాగే ఉంటుంది. దాంతో ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు. గతంలో తెలంగాణలోని కూకట్ పల్లి నియోజకవర్గంలో జాతీయ జనసేన పార్టీకి రెండు వందలకుపైగా ఓట్లు వచ్చాయి. జనసేన బరిలో ఉండటంతో కన్ ఫ్యూజన్ తో ఆ పార్టీకి ఓట్లేశారని భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇండిపెండెంట్లు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లతో పోలిన వారు రంగంలోకి దిగారు. ఆయా పార్టీల వారు.. వీరిని వెదికి పట్టుకుని మరీ రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎంత మంది బరిలో ఉంటారు.... ఎంత మంది ఉపసంహరించుకుంటారన్నది తేలాల్సి ఉంది.