ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా యూపీ వర్చువల్ ర్యాలీలో మాటల తూటాలు పేల్చుతున్నారు. అయితే ఈరోజు ఆసక్తికర ఘటన జరిగింది.
ఓవైపు ప్రధాని నరేంద్ర మోదీ.. యూపీలో తమకు ప్రతిపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తోంటే.. మరోవైపు ఆయన కేబినెట్‌లోని ఓ మంత్రి అదే సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్‌కు ఒంగిఒంగి దండాలు పెట్టారు.
ములాయంకు దండాలు..?
ఈరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఉభయ సభల సభ్యులనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ పార్లమెంటుకు వచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన పార్లమెంటు నుంచి తిరిగి వెళ్లే సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ములాయంను ఆప్యాయంగా పలకరించారు. తలవంచి ఆయనకు నమస్కారం చేశారు. మూలాయం సింగ్ యాదవ్ కూడా.. స్మృతి ఇరానీ తలపై చేయి పెట్టి దీవించారు. ఈ వీడియో వైరల్ అయింది. స్మృతి ఇరానీతో పాటు మరో కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ములాయంతో మాట్లాడారు.
వారంతా గూండాలు?
ఇది జరిగిన కొన్ని గంటల తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ.. దిల్లీ నుంచి యూపీ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల దాడి చేశారు.
2017కు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి, భద్రతలకు తీవ్ర విఘాతం కలిగేది. మేరట్, బులంద్‌షెహర్ వంటి జిల్లాల్లో అమ్మాయిలు బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వారు ఎంతో ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాల పాలనలో.. లూఠీలు చేసేవారు, గూండాలదే రాజ్యం. వాళ్ల మాటలే ప్రభుత్వ ఆదేశాలుగా భావించేవారు. ఓవైపు మేం ఉత్తర్‌ప్రదేశ్‌లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొంతమంది ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీకారమే వారి ధ్యేయం. - ప్రధాని నరేంద్ర మోదీ
ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. అయితే ఓవైపు ఆ పార్టీ వ్యవస్థాపకుడికి కేంద్రమంత్రులు దండాలు పెడుతోంటే.. మరోవైపు ప్రధాన మంత్రి వారిని గూండాలు అంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read: PM Modi Virtual Rally: వారిది గూండాల రాజ్యం.. మాది గ్రామీణ స్వరాజ్యం: ప్రధాని మోదీ