No Change of Candidates in YCP : వైఎస్ఆర్‌సీపీలో కొంత మంది అభ్యర్థులను మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తోసిపుచ్చారు. నాలుగు అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది. ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన.. వాళ్లను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. నలుగురు వ్యక్తులు వచ్చి చేరారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు . సజ్జల క్లారిటీతో వైసీపీలో అభ్యర్థుల మార్పు ఊహాగానాలకు చెక్ పడింది.
కొన్ని సీట్ల విషయంలో మార్ప చేర్పుల విషయంలో వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోందని ఇటీవల ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా మైలవరం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు. తో వైసీపీ కుల సమీకరణాల లెక్కలు వేసుకొని చివరకు మైలవరం ఎంపీపీగా ఉన్న సర్నాల తిరుపతిరావును అభ్యర్థిగా ప్రకటించారు. కానీ మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తితో ఆయనను అక్కడకు మారుస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పెడన నుండి గెలిచిన మంత్రి జోగి రమేష్ కు ఈసారి పెనమలూరు టికెట్ ఇచ్చారు. మైలవరం జోగి రమేష్ సొంత నియోజకవర్గం.
మరో మంత్రి విడదల రజినీ సీటు కూడా మరోసారి మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేట నుండి గెలిచిన ఆమెను రి గుంటూరు వెస్ట్ కు పంపారు. ఇప్పుడు తనను గుంటూరు ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని చెప్పుకున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య.. తన సీటు మార్చాలని పొన్నూరు ఎమ్మెల్యే లేటు సీటు లేదా గుంటూరు పశ్చిమ సీటు ివ్వాలని కోరుతున్నట్లుగా చెపుతున్నారు. ఇక జనసేన నుండి వైసీపీలో చేరిన పోతిన మహేష్ కు విజయవాడ వెస్ట్ సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలన్నింటినీ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు.
ఎన్నికలు నిష్పాక్షికంగా జరగడం లేదని సజ్జల అంటున్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పడు ఉన్న వాలంటీర్లను తీసివేసి.. జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని ఆరోపించారు.