Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కసరత్తు మొదలైంది. నిర్ణీత సమయం కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదల కానుందని సమాచారం. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ సీఎం జగన్ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల షెడ్యూల్ కంటే 20 రోజులు ముందే ఎన్నికలు జరగవచ్చని చెప్పారు. అంటే... ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి (February) 15 నుంచి 20వ తేదీ మధ్య ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో... రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల బృందం(central election team) పర్యటిస్తోంది. దీంతో ఎన్నికల హడావుడి మరింత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం.. ఇవాళ, రేపు వరుస సమీక్షలు నిర్వహించబోతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024తో పాటు రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష చేయనుంది. ఏపీకి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంలో... సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్‌కే గుప్తా, హిర్దేశ్‌కుమార్, అజయ్‌బాదోతోపాటు పలువురు అధికారులు ఉన్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్‌లో రెండు రోజుల పాటు... కలెక్టర్లు, ఎస్పీలతో వీరు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఏపీ ఓటర్ల జాబితాపై కేంద్ర ఎన్నికల సంఘాలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రధాన పార్టీలయిన వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, బీజేపీలు ఓటర్ లిస్టుపై ఈసీకి పోటాపోటీగా కంప్లెయింట్లు చేసుకున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు, దొంగల ఓట్ల వంటి అంశాలపై ఆరోపణలు చేశారు. దీంతో జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీతోపాటు తదితర అంశాలపై నివేదికల ఆధారంగా అధికారులతో ఈసీ చర్చిస్తుంది. అలాగే... ఎన్నికల నిర్వహణ ప్రణాళికతోపాటు పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి... రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో పాటు ఉన్నతాధికారులతో ఈసీఐ బృందం చర్చించనుంది. . ఏపీలో ఎన్నికల ఏర్పాట్లుపైన కేంద్ర బృందం పలు సూచనలు చేయనుంది. ఇక... ఇప్పటికే ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది వివరాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సంక్షేమమే ప్రాతిపదికగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వెళ్తోంది. అలాగే... జనాదరణ లేని, ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉన్న అభ్యర్థులను మార్చే పనిలో ఉంది జగన్ సర్కార్. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లను మార్చారు. ఇంకా కొంత మందిని మార్చబోతున్నారు. 175 కి 175 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో.. ముందు వెళ్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక... టీడీపీ-జనసేన కలిసి జగన్ సర్కార్‌ను ఎదుర్కోబోతున్నాయి. ప్రజా వ్యతిరేక ఓటు చీటకుండా చేసి... అధికారం దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈసారి చంద్రబాబు రెండు అడుగులు ముందే ఉన్నారు. ఇప్పటికే పలు ఎన్నికల హామీలు కూడా ప్రకటించేందుకు. అంతేక... టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం చేసే పనిలో ఆ రెండు పార్టీలు నిమగ్నమై ఉన్నాయి. హామీలు కూడా ప్రకటించారు. దీంతో ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ఆర కాంగ్రెస్ పార్టీకి.... టీడీపీ-జనసేన కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంది. నువ్వా-నేనా అన్నట్టు ఈసారి ఏపీ ఎన్నికలు జరుగుతాయని.. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.