Modi Two Days Visit In Telangana: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమ, మంగళవారాల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.15,718 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం అదిలాబాద్‌లో రూ.6,697 కోట్లు విలువైన, ఐదో తేదీన సంగారెడ్డిలో రూ.9,021 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ స్థానాలకుగాను ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని సభలు పార్టీ యంత్రాంగానికి మరింత ఊపు తీసుకువస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మోదీ సభలు నిర్వహణ ద్వారా ప్రజల చూపును తమవైపు తిప్పుకోవాలని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. 


హెలికాఫ్టర్‌లో నాగ్‌పూర్‌ నుంచి అదిలాబాద్‌కు


తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ హెలికాఫ్టర్‌లో రానున్నారు. సోమవారం ఉదయం మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. గవర్నర్‌ తమిళ సై సౌందరరాజన్‌, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుని అభివృద్ధి పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమమంతా ఒక ప్రాంగణంలో జరుగుతుంది. మరో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. 


ఆదిలాబాద్‌లో రెండు గంటలు


ఆదిలాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ రెండు గంటలపాటు సమయాన్ని వెచ్చించనున్నారు. ప్రధానితో కేంద్ర మంత్రులతోపాటు స్థానిక నేతలు బండి సంజయ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌తోపాటు పలువురు ముఖ్య నేతలు ప్రధాని సభలో పాల్గొననున్నారు. సభలు అనంతరం 12.10 గంటలకు హెలికాఫ్టర్‌లో ప్రధాని మోదీ బయలుదేరి నాందేడ్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళతారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుని రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. రెండో రోజు పర్యటన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(సీఏఆర్‌ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలను చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రెండు వేల మందితో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బహిరంగ సభలు వేదికగా తెలంగాణలోని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై వమోదీ విమర్శులు ఎక్కుపెట్టే అవకాశముంది. కుటుంబ పాలనను ప్రోత్సహించే పార్టీలుగా వీటిపై విమర్శలను ప్రధాని సందించనున్నారు. గడిచిన పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధి, గతంలో జరిగిన అవినీతి, అక్రమాలు వంటి అనేక విషయాలపై మోదీ ప్రసంగించే అవకాశముందని చెబుతున్నారు.


Also Read: బీఆర్ఎస్‌కు మరో షాక్! బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్


Also Read:తెలంగాణలో 9మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ