Elections 2024 :  ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి కౌంట్ డౌన్ ప్రారంభమయిందని ప్రధాని మోదీ  ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. మాఫియా వికాసం వైసీపీ సర్కార్ ఐదేళ్ల పాటు పని చేసిందని విరుచుకుపడ్డారు  ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని.. వైసీపీ మంత్రులు గుండాగిరి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఇక వారి ఆటలు సాగవని, వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందని చెప్పారు. ఏపీలోని మాఫియాలన్నింటికీ ఎన్డీయే ప్రభుత్వం ట్రీట్‌మెంట్ ఇస్తుందని హామీ ఇచ్చారు. 


ఇసుక మాఫియా వల్లనే కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం   !                            


ఇసుక మాఫియా వల్లనే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని మోదీ విమర్శించారు. రాయలసీమలో అపార ఖనిజ సంపద ఉందన్నారు. పర్యాటక రంగానికి అవకాశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. పులివెందులలో అరటి రైతుల కోసం క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ ఇస్తామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో రైతులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.  పోలవరం ప్రాజెక్టు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని విమర్శించారు.   జల్ జీవన్ మిషన్‌కు జగన్ సర్కార్ సహకరించలేదని ప్రధాని మోదీ జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ఏపీలో బుల్లెట్ ట్రైన్ కావాలంటే ఎన్డీయే ప్రభుత్వం రావాలని పిలుపునిచ్చారు.  పుంగనూరు పరిధిలోని ఘటనలపైనా  ప్రధాని మోదీ స్పందించారు.  వైసీపీ మంత్రి ఇక్కడ రౌడీ రాజ్యం నడుపుతున్నాడని మండిపడ్డారు.                        


ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే బుల్లెట్ రైలు                               


ఏపీలో డబుల్ ఇంజిన్‌ సర్కార్‌ రావాలని మోదీ తెలుగులో చెప్పారు. నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయిందని, కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతామన్నారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. టమాటా నిల్వ చేసేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి బుల్లెట్‌ రైలు కావాలా.. వద్దా అని ప్రశ్నించిన మోదీ అభివృద్ధి కావాలంటే ఎన్డీఏకు ఓటువేయాని పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధి లేదని, యువతకు ఉద్యోగాలు లేవన్నారు. 


కాంగ్రెస్ పైనా విమర్శలు                         


గత పదేళ్లలో చేపట్టిన మంచి పనులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తానని చెబుతోందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. రామమందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వెనక్కి తీసుకుంటానని చెబుతోంది. రామ మందిరానికి తాళం వేస్తానని అంటుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని విభజిస్తూ మాట్లాడుతున్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన పనులతో భారతదేశానికి గల్ఫ్ దేశాల్లో గౌరవం పెరిగిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. భారత్‌.. విభిన్న జాతుల సమూహం అని చెబుతోంది, కానీ తెల్లవాళ్లు, నల్లవాళ్లు అనే ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారని ప్రధాని మోదీ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.