Present Political Scenario in Visakha East: విశాఖ జిల్లాలోని మరో నియోజకవర్గం విశాఖ తూర్పు. ఇది కూడా నగర పరిధిలోని నియోజకవర్గమే. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగానే ఏర్పాటైంది. ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మూడుసార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధిస్తూ వచ్చారు. హ్యాట్రిక్ విజయాలతో ఊపు మీద ఉన్న వెలగపూడి రామకృష్ణబాబు నాలుగో ఎన్నికల్లోనూ గెలుపు తనదే అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. టీడీపీ, వెలగపూడి రామకృష్ణబాబుకు కంచుకోటగా ఉన్న తూర్పు నియోజకవర్గంపై వైసీపీ అగ్ర నాయకత్వం దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ జెండా ఎగురేయాలన్న ఉద్ధేశంతో ఇక్కడ బలమైన వ్యక్తిని బరిలోకి దించుతోంది. ప్రస్తుతం విశాఖ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ వెలగపూడి రామకృష్ణబాబుపై పోటీకి సిద్ధపడుతున్నారు.
అత్యధిక సంఖ్యలో ఓటర్లు
నగర పరిధిలోని నియోజకవర్గాల్లో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా విశాఖ తూర్పు ఉంది. ఇక్కడ 3,51,695 మంది ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. వీరిలో 1,72,707 మంది పురుష ఓటర్లు కాగా, 1,78,971 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషలతో పోలిస్తే మహిళా ఓటర్లు సంఖ్య దాదాపు ఆరు వేలు ఉంది. వీరు ఎవరి వైపు మొగ్గు చూపిస్తే వారే విజయం సాధించే అవకాశముంది.
ఇవీ ఎన్నికల ఫలితాలు
ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీకి కంచుకోటగా ఈ నియోజకవర్గం కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీకి భారీగా మెజార్టీ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం రాష్ట్రమంతా ఉన్నా.. ఇక్కడ టీడీపీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్‌పై 4,031 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి వెలగపూడి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వెలగపూడి తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌పై 47,883 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లోనూ మూడోసారి వెలగపూడి రామకృష్ణబాబు విజయాన్ని దక్కించుకున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అక్కరమాని విజయనిర్మలపై 26,474 ఓట్ల తేడాతో గెలుపొందారు.