Who Will Win Tekkali In Next Election: శ్రీకాకుళం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం టెక్కలి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,14,739 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,06,397 మంది పురుషులు, 1,08,337 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. టెక్కలి అసెంబ్లీ స్థానానికి తొలిసారి 1952లో ఎన్నిక జరగ్గా, ఇప్పటివరకూ 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి. నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిశీలిస్తే అత్యధికంగా టీడీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు.


8 సార్లు ఆ పార్టీదే విజయం


టెక్కలి నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు ఉప ఎన్నికలతో కలిపి ఇక్కడ 17సార్లు ఎన్నికలు జరిగాయి. ఎనిమిది సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1952లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఆర్‌ఎల్‌ఎన్‌ దొర సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బి.కూర్మన్నపై 607 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955 ఎన్నికల్లో మరోసారి ఆర్‌ఎల్‌ఎన్‌ దొర సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా బరిలో దిగిన బి కూర్మన్నపై 533 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఆర్‌.సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎల్‌ఎన్‌ దొరపై 9190 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్‌.రాములు సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన బి.లక్ష్మినారాయణమ్మపై 8,947 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ఎల్‌ నాయుడు ఇక్కడ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎస్‌బీ రావుపై 14,504 ఓట్ల తేడాతో ఘనం విజయాన్ని నమోదు చేశారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన బమ్మిడి నారాయణస్వామి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ఎల్‌ నాయుడుపై 13,704 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏ జనార్ధనరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ఎల్‌ నాయుడిపై 19,716 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వరద సరోజన కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సమీప ప్రత్యర్థి డీవీ రమణరావుపై 21,571 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన డి నాగావళి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన ఎస్‌ లోకనాథంపై 7434 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 


ఎన్‌టీ రామారావు విజయం


1994లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌టీ రామారావు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పోటీ చేసిన వి.బాబూరావుపై 40,890 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో(అదే ఏడాది) జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి హెచ్‌.అప్పయ్యదొర పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన పి.విశ్వేశ్వరరావుపై 22,197 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె.రేవతిపతి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగిన హెచ్‌.అప్పయ్యదొరపై 6,052 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో హెచ్‌.అప్పయ్యదొర కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన కె.అచ్చెన్నాయుడుపై 1,893 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో ఇదే స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కొర్ల భారతి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన కింజరాపు అచ్చెన్నాయుడిపై 7,173 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కింజరాపు అచ్చెన్నాడు ఇక్కడ తొలిసారి విజయం సాధించారు. వైసీపీ నుంచి బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్‌పై 8,387 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లోనూ అచ్చెన్నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి మరోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన పేరాడ తిలక్‌పై 6,545 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గడిచిన రెండు ఎన్నికల్లో విజయం సాధించిన అచ్చెన్నాయుడు హ్యాట్రిక్‌ విజయంపై దృష్టి సారించి పని చేస్తున్నారు. ఇక్కడి నుంచి 2014లో గెలిచిన అచ్చెన్నాయుడు విభజన తరువాత ఏపీలో ఏర్పడిన తొలి కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.