PWD People Cast Their Vote In Third Phase Elections 2024: ఓటు.. ఐదేళ్ల పాటు మనల్ని పాలించే, మనకు మంచి చేసే నేతను ఎన్నుకునేందుకు సామాన్యునికి ఉన్న ఏకైక దివ్యాస్త్రం. రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, భవిష్యత్ అంతా మనం వేసే ఓటుపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఓటు వేయడానికి బద్దకిస్తుంటారు. తమకు వారు పని చేసే కంపెనీలు ఓటేసేందుకు సెలవులు ప్రకటించినా ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి కదలకుండా నేతలు అలా.. ఇలా అంటూ విమర్శలు చేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తారు. ఆరోగ్య సమస్యలున్నా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి వారిని చూసి ఓటు వేయడానికి బద్దకించే చాలామంది మారాలి.


చేతులు లేకున్నా..


దేశవ్యాప్తంగా మంగళవారం మూడోదశ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ విడతలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ సాగింది. ఈ క్రమంలో గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో అంకిత్ సోని అనే వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా పోలింగ్ కేంద్రానికి వచ్చి కాళ్లతో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్నీ అవయవాలు సరిగ్గా ఉన్నా ఓటు వేయడానికి బద్దకించే వారికి సరైన సమాధానం చెప్పేలా రాజ్యాంగం తనకు కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని శభాష్ అనిపించుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అంకిత్ సోని (Ankit Soni) కోరారు. '20 ఏళ్ల క్రితం జరిగిన ఓ విద్యుత్ ప్రమాదంలో నా రెండు చేతులు కోల్పోయాను. నా గురువుల ఆశీర్వాదంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. గత 20 ఏళ్లలో ఎప్పుడూ కూడా నేను ఓటింగ్ కు దూరంగా ఉండలేదు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో ఓటేస్తున్నా. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.' అని అంకిత్ సోని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అంకిత్ సోని చిత్తశుద్ధిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 






వీర్ చైర్ పై వచ్చి..


గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కుమారుడు అనూజ్ పటేల్ గుజరాత్ లోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతేడాది బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన చికిత్స పొందుతున్న ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో వీల్ చైర్ లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి సిబ్బంది సాయంతో ఓటు వేశారు. 






అలాగే, ఉత్తరప్రదేశ్ లోని దివ్యాంగ ఓటరు అయిన రాహుల్ కాస్గంజ్ లోని పోలింగ్ కేంద్రానికి తన తండ్రి సాయంతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీల్ చైర్ లోనే వచ్చి తన బాధ్యతను నిర్వర్తించారు. ఇంతకు ముందు కూడా తాను ఓటు వేశానని.. ఇది చాలా గొప్పగా అనిపిస్తుందని రాహుల్ ఓటు వేసిన అనంతరం అన్నారు. అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అటు, మహారాష్ట్రలోని ఫాల్తాన్ లో 96 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు.










Also Read: Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి చుక్కెదురు - జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు, బెయిల్ పిటిషన్ పైనా విచారణ వాయిదా