Permission Is Mandatory For Door-To-Door Campaign.. Clarified by EC : ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రాజకీయ పార్టీలకు చెందిన నేతల వ్యవహారశైలి, ప్రచారం వంటి అంశాలపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి అనేక నిబంధనలు విధించిన ఎన్నికల కమిషన్‌.. తాజాగా ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని షరతులను విధించింది. సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచార కార్యక్రమాల అనుమతులకు రాజకీయ పార్టీలు సువిధ పోర్టల్‌ వినియోగించాల్సిందిగా సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా రాజకీయ పార్టీలకు సూచించారు. ఈ మేరకు రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో ఆయన సమావేశాన్ని ఈసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అధికార వైసీపీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఈవో మీనా కీలక సూచనలు చేశారు. ఇంటింటి ప్రచారానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహణకు అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. 


48 గంటలు ముందు దరఖాస్తు 


రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలు, ఇతర ప్రచారానికి సంబంధించి 48 గంటలు ముందుగానే సువిధ యాప్‌, పోర్టల్‌ నుంచి సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సీఈవో ముకేష్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. దరఖాస్తు చేసిన 24 గంటల్లోగా ప్రచారానికి సంబంధించిన అన్ని అనుమతులు జారీ అవుతాయని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ నామినేషన్లు, అఫిడవిట్‌ దాఖలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు కోసమే ప్రత్యేకంగా పోర్టల్‌ను రూపొందించినట్టు వివరించారు. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అనుసరించాల్సిన విధి విధానాలు, తీసుకోవాల్సిన అనుమతులపైనా అవగాహన ఉండాలని వెల్లడించారు. 


నాయకుల కదలికలపై దృష్టి


రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడంపై ఎన్నికల కమిషన్‌ దృష్టి సారించింది. అందులో భాగంగానే పార్టీల సహాయ, సహకారాలను తీసుకుంటూనే.. నేతల కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు, ఖర్చులు వంటి అంశాలను ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తోంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఎన్నికల కమిషన్‌ సూచనలు మేరకు పోలీసు యంత్రాంగం క్షేత్ర స్థాయిలో కవాతు నిర్వహిస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా సహకరించాలని పోలీస్‌శాఖ సూచిస్తోంది. పోలీస్‌శాఖ, ప్రత్యేక బలగాలు సహకారంతో గ్రామాలు, పట్టణాల్లో కవాతు నిర్వహిస్తూ ప్రజలకు ఎన్నికల కోడ్‌పై అవగాహనను, ఎన్నికలకు సంబంఽధించిన సూచనలు చేస్తోంది.