Sharmila Vs Jagan: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎ జగన్‌ తీరని అన్యాయం చేశాడని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో మేలు చేశాడని, జగన్‌ మాత్రం ద్రోహం చేశాడన్నారు. గౌరవంగా బతకాల్సిన ఉద్యోగులను అవమానిస్తున్నారన్నారు. బొత్స వంటి నేతలు ప్రభుత్వ ఉద్యోగులు తమ కాళ్లు పట్టుకుని అడగాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఉద్యోగుల గొంతు నొక్కే ప్రయత్నాన్ని చేస్తున్నారని, ఉద్యోగుల హక్కులను కాల రాస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్న షర్మిల.. ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని విమర్శించారు. నవరత్నాలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న వైసీపీ నేతలు.. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్‌ చేశారు. 


ఈ సందేహాలకు సమాధానాలేవీ అంటూ ప్రశ్న


అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేయడంతోపాటు జీపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారని, మరి ఎందుకు అమలు చేయాలేదని షర్మిల ప్రశ్నించారు. జీపీఎస్‌ అవసరం లేదని, కాంగ్రెస్‌ పార్టీ అమల్లోకి తెచ్చిన ఓపీఎస్‌ విధానం అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఒకటో తేదీన జీతాలు అందుకోవాల్సిన ఉద్యోగులు.. ప్రతినెల 15 నుంచి 25 మధ్యలో జీతాలు అందుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని, ఇది అసమర్థ పాలనకు నిదర్శనం కాదా..? అని ప్రశ్నించారు.


11వ పీఆర్‌సీ కమిషన్‌లో ప్రకటించిన ఐఆర్‌ 27 శాతం కంటే తక్కువ ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది కాదా..? అని షర్మిల సూటిగా ప్రశ్నించారు. 2023 జూలై ఒకటో తేదీ నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్‌సీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని, కేవలం కమిషన్‌ వేసి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. నివేదిక ఇచ్చే వరకు కొత్త ఐఆర్‌ ఇస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు.. దాన్ని గురించి ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. హెచ్‌ఆర్‌ఏ రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 30 శాతం నుంచి 24 శాతానికి ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో పని చేసే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 20 శాతం నుంచి 16 శాతానికి ఎందుకు తగ్గించారన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన 22 వేల కోట్ల పాత బకాయిలు సంగతి ఏంటని షర్మిల ప్రశ్నించారు. 2022 నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సి టీఏ, డీఏలు రూ.270 కోట్లు 2027లో చెల్లిస్తామని చెప్పమేంటని ప్రశ్నించారు. ఉద్యోగులు సరెండర్‌ చేసిన లీవ్‌లకు సంబంధించిన రూ.2500 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారని షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగులకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు రూ.118 కోట్లు పెండింగ్‌ ఎందుకున్నాయని, వీటి సంగతి ఏమిటని ప్రశ్నించారు.


ఉద్యోగులకు అండగా నిలచేది కాంగ్రెస్సే


ఉద్యోగులకు అండగా నిలచేది కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రమేనని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పాత ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ చూసుకున్నట్టుగా ఉద్యోగులకు చూసుకుంటామన్నారు. పెన్షన్‌ పంపిణీ పేరుతో వృద్ధులను చంపుతున్నారని, ఐఏఎస్‌లు వైసీపీ పార్టీకి మేలు చేస్తున్నారని, వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే పెన్షన్లు ఆగుతాయనే ప్రచారాన్ని సృష్టిస్తున్నారన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఐఏఎస్‌లకు జీతాలను వైసీపీ ఇస్తోందా..? ప్రజలు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. వైసీపీ ఒత్తిళ్లకు ఐఏఎస్‌ అధికారులు తలొగ్గుతున్నారని విమర్శించారు.