Nara Lokesh got highest majority in AP :  మంగళగిరి నియోజకవర్గ 72 ఏళ్ల ఎన్నికల చరిత్రలో తిరుగులేని మెజారిటీ సాధించి విజేతగా నారా లోకేష్ నిలిచి రికార్డు నెలకొల్పారు. 1952లో మంగళగిరి నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటివరకూ అంటే 2024 సంవత్సరం వరకూ పోటీ చేసిన అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ 91,447ఓట్ల రికార్డు నారా లోకేష్ సాధించారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి రాజ్యాంగం అమలు అయ్యాక, అప్పటి మదరాసు రాష్ట్రంలో భాగమైన మంగళగిరి నియోజకవర్గంలో 1952లో తొలిసారి ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన డి లక్ష్మయ్య 17265 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇదే ఇప్పటివరకూ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ రికార్డు. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ మొత్తం 167710 ఓట్లు సాధించి తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,447 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గం 72 ఏళ్ల రికార్డుని అధిగమించిన నారా లోకేష్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.